ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా వైరస్ పై ప్రజల్లో అనేక అపోహలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని చైనా దేశమే కావాలని సృష్టించి ప్రపంచ దేశాలపై వదిలిందనేది అనేక మంది అనుమానం. అయితే ఎటువంటి రుజువు లేని ఇటువంటి వార్తలను ప్రపంచ దేశాల్లో మూడింట ఒక వంతు మంది ప్రజలు నమ్ముతున్నారని ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
అక్టోబర్లో కార్నెల్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనంలో కోవిడ్–-19పై అపోహలు సృష్టించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే ముందున్నారని తేలింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ మరియు 5 జీ నెట్వర్క్లను ఉపయోగించి ప్రజలను నియంత్రించే కుట్ర జరుగుతుందని అనేక మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇటువంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసే వారి ఖాతాలపై తాజాగా ఫేస్‌బుక్ నిషేధాన్ని ప్రకటించింది.
బ్రిటన్ మరియు నెదర్లాండ్స్ కు చెందిన పరిశోధకులు యూకే, అమెరికా, ఐర్లాండ్, మెక్సికో, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనాపై వస్తున్న అపోహలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ‘‘చాలా మంది ప్రజలు కోవిడ్–-19పై వస్తున్న వదంతులును బలంగా నమ్ముతున్నారని, మహమ్మారి కంటే హానికరమైన ‘ఇన్ఫోడెమిక్’ ప్రజల్లో బలంగా ఉందని’’ తేలింది. కరోనా వైరస్ ఉద్దేశపూర్వకంగానే వుహాన్ ల్యాబరేటరీలో చైనా తయారు చేయబడిందని, ఎక్కువ మంది విశ్వసిస్తున్నట్లు ఈ అధ్యయనం కనుగొంది.
యూకే మరియు యూఎస్లో 22 నుంచి -23 శాతం మంది ప్రజలు ఈ వాదనను నమ్ముతున్నామని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఈ అపోహలు 33 శాతం మంది మెక్సికో ప్రజల్లో మరియు 37 శాతం మంది స్పెయిన్ ప్రజల్లో బలంగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. 5 జీ ఫోన్ నెట్‌వర్క్‌ల ద్వారా కోవిడ్–19 లక్షణాలు మరింత దిగజారిపోయాయని మెక్సికో మరియు స్పెయిన్‌లోని16 శాతం మంది, ఐర్లాండ్‌లోని 12 శాతం మంది, యుకె మరియూ యూఎస్లలోని 8 శాతం మంది విశ్వసిస్తున్నాట్లు అధ్యయనం తెలిపింది.
రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన మరో అధ్యయనం "ప్రభుత్వాలు మరియు టెక్నాలజీ సంస్థలు ప్రజల్లో డిజిటల్ మీడియా లిటరసీని పెంచితేనే ఈ అపోహలు తొలగుతాయని, లేకపోతే, వ్యాక్సిన్ అభివృద్ధి కూడా దీన్ని అడ్డుకోలేదని" పేర్కొంది. కాగా ఈ అధ్యనంలో యుకేకు చెందిన 3 వేల మంది, యుఎస్, మెక్సికో, స్పెయిన్ మరియు ఐర్లాండ్‌కి చెందిన 700 మంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Corona, Corona Vaccine, Donald trump