కరోనా ఎఫెక్ట్..తిరుమలకు భారీగా తగ్గిన భక్తుల రాక

కరోనా వైరస్ భయాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. మునుపటితో పోలిస్తే సగం సంఖ్యలోనే భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు.

news18-telugu
Updated: March 17, 2020, 1:48 PM IST
కరోనా ఎఫెక్ట్..తిరుమలకు భారీగా తగ్గిన భక్తుల రాక
తిరుమల శ్రీవారి ఆలయం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి భయాల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పలు దేశాలను కరోనా హడలెత్తిస్తున్న నేపథ్యంలో భక్తుల రాకను తగ్గించే దిశగా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దగ్గ, జలుబు, జ్వరం వంటి అనారోగ్య బాధితులు స్వామివారి దర్శనానికి రావద్దని టీటీడీ కోరింది. అలాగే కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే భక్తులు తిరుమలకు రావద్దని సూచించింది. అటు ముందుగా చేసుకున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదులను రద్దు చేసుకునేందుకు లేదా వాయిదావేసుకునేందుకు కూడా టీటీడీ అధికారులు భక్తులకు వెసులుబాటు కల్పించారు.

ఈ నేపథ్యంలో తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. సాధారణ రోజుల్లో తిరుమల స్వామివారి దర్శనం కోసం దాదాపు 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వారాంతపు సెలవు దినాల్లో ఈ సంఖ్య 90 వేల నుంచి 1 లక్ష వరకు ఉంటుంది. అయితే కరోనా భయాల నేపథ్యంలో సోమవారం 44 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ తక్కువగా ఉందన్న కారణంతో కొందరు భక్తులు ఒకే రోజు ఒకటికంటే ఎక్కువసార్లు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు 30 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుని ఉండొచ్చని అంచనావేస్తున్నారు. కరోనా భయాల నేపథ్యంలో ముందుముందు భక్తుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొన్ని గంటల ఉంచి, అక్కడి నుంచి ఆలయంలో స్వామివారి దర్శనానికి పంపే విధానాన్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు. భక్తులకు టైమ్ స్లాట్ కేటాయించి, ఆ సమయంలో నేరుగా స్వామివారి దర్శనానికి పంపుతున్నారు. తద్వారా క్యూలైన్‌లోకి ప్రవేశించిన దాదాపు 45 నిమిషాల వ్యవధిలోనే భక్తులు..స్వామివారిని దర్శించుకుని భయటకు వస్తున్నారు.

భక్తుల సంఖ్య తగ్గడంతో స్వామివారి హుండీ ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. సాధారణంగా రోజూ స్వామివారి హుండీ ఆదాయం రూ.3 కోట్లకు పైగా ఉండేది. అయితే భక్తుల సంఖ్య తగ్గడంతో ప్రస్తుతం రోజువారీ హుండీ ఆదాయం రూ.2.5 కోట్లుగా ఉంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

(పుష్పరాజ్, న్యూస్18 ప్రతినిధి, తిరుమల)

First published: March 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading