తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు నిలిపివేత

తెలంగాణలో 18 ప్రైవేట్ ల్యాబ్స్‌తో పాటు 11 ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ కోవిడ్ పరీక్ష కేంద్రాల్లో ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: July 2, 2020, 2:41 PM IST
తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు నిలిపివేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు నిలిచిపోయాయి. జూలై 2 నుంచి 5 వరకు తాత్కాలికంగా పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ల్యాబ్స్ ప్రకటించాయి. కొవిడ్ టెస్టుల్లో ఖచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. సిబ్బందికి కరోనా శాంపిల్స్ సేకరణపై శిక్షణ, శానిటైజేషన్ కార్యక్రమాల కోసం కరోనా పరీక్షలను నాలుగు రోజుల పాటు నిలివివేస్తున్నాయి. ఐతే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్‌ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని.. కానీ నేరుగా ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకునే వారి శాంపిల్స్ మాత్రం సేకరించమని స్పష్టం చేశాయి.

తెలంగాణలో మొత్తం 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. గత 15 రోజులగా ప్రైవేట్ ల్యాబ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఐతే ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి లోపాలను గుర్తించింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించడం లేదని ఇప్పటికే 12 ల్యాబ్ లకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి. మరికొన్నింటిలో మాత్రం ఇప్పటికీ మార్పురాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. ఎలాంటి లక్షణాలు లేని వారికి కూడా పరీక్షలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, తెలంగాణలో 18 ప్రైవేట్ ల్యాబ్స్‌తో పాటు 11 ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ కోవిడ్ పరీక్ష కేంద్రాల్లో ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 8,082 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. 267 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,008 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 4,234 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,216 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 1,018 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో బుధవారం సాయంత్రం వరకు 92,797 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
First published: July 2, 2020, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading