news18-telugu
Updated: November 4, 2020, 3:31 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. నవంబర్ 3న ఢిల్లీలో 6700 కొత్త కేసులు నమోదు కావడంతో.. ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్(మూడో దశ) మొదలైందనే ప్రచారం మొదలైంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దీన్ని మూడో దశగా భావించవచ్చని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాము పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపిన కేజ్రీవాల్.. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పండగల సీజన్‌తో పాటు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న క్రమంలోనే కరోనా కేసులు పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. కొత్త కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కరోనా కేసులపై హెచ్చరికలు జారీ చేసింది. రోజుకు 15 వేల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
శీతాకాలంతో పాటు కరోనా విజృంభిస్తే ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడొచ్చని వెల్లడించింది. పండగల సందర్భంగా ఏర్పడే సమూహాల కారణంగానే కరోనా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 86 లక్షలకు చేరింది. 46253 కొత్త కేసులు నమోదయ్యాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
November 4, 2020, 3:24 PM IST