Cabin Fever: కరోనా కాలంలో కొత్త మానసిక సమస్య.. పెరుగుతున్న క్యాబిన్ ఫీవర్‌ బాధితులు

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్-19 కారణంగా చాలా మంది భారతీయులు సుదీర్ఘకాలం ఇంట్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు సైతం ఇంట్లోనే ఉంటూ పనిచేస్తున్నారు. దీంతో దేశంలో క్యాబిన్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది.

  • Share this:
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి శక్తి లేనట్లు, అలసిపోయినట్లు అనిపిస్తోందా? ఇలాంటి అశాంతి, మానసిక ఆందోళన మీ రోజును ప్రభావితం చేస్తున్నాయా? అయితే మీరు క్యాబిన్ ఫీవర్ అనే మానసిక సమస్య బారిన పడినట్లు భావించాలి. గతంలో సాధారణ ప్రపంచానికి దూరంగా జలాంతర్గాములు, ఆయిల్ రిగ్‌లు, ఓడల్లో పనిచేసే సిబ్బంది.. ఇరుకుగా, మూసివేసినట్లు ఉండే ప్రదేశాలలో పనిచేసే వ్యక్తుల్లో ఈ సమస్య ఇక్కువగా కనిపించేది. అయితే కోవిడ్-19 కారణంగా చాలా మంది భారతీయులు సుదీర్ఘకాలం ఇంట్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు సైతం ఇంట్లోనే ఉంటూ పనిచేస్తున్నారు. దీంతో దేశంలో క్యాబిన్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీర్ఘకాలంలో ఇది మరిన్ని అనారోగ్యాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని క్లినికల్ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం, ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండటం వల్ల క్యాబిన్ ఫీవర్ బారిన పడవచ్చు. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య. దీని ప్రధాన లక్షణాలలో అలసట ఒకటి. విసుగు, చిరాకు, అసహనం, ఆందోళన, ఒంటరితనం, నిస్సహాయత, నిరాశ.. వంటివన్నీ ఈ సమస్య లక్షణాలు.

* బాధితులు ఎవరు?
ఒంటరి జీవితానికి అలవాటు పడిన వారితో పోలిస్తే.. సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉన్నవారు క్యాబిన్ ఫీవర్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు ఉన్నవారు మహమ్మారి కారణంగా ఈ రుగ్మత బారిన పడుతున్నారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి ప్రజల జీవన శైలి మారిపోయింది. నలుగురితో కలవాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. బంధుమిత్రుల ఇళ్లకు రాకపోకలు చాలావరకు తగ్గిపోయాయి. ఇంట్లోనే ఉంటూ రోజువారీ పనులతో కాలం వెల్లదీసేవారికి ఒకానొక సందర్భంలో మానసిక ఆందోళన మొదలవుతుంది. క్రమంగా స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది. దీనికి తోడు వైరస్ బారిన పడతామనే భయం, ప్రియమైన వారిని కోల్పోతామనే ఆందోళన.. వంటివన్నీ కలిసి మానసికంగా కుంగదీస్తాయి. ఇది దీర్ఘకాలంలో శక్తి క్షీణతకు కూడా దారితీస్తుంది. ఉద్యోగంలో ఉత్పాదకత తగ్గడానికి ఇది కారణం కావచ్చు. ఇవన్నీ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి.

ఈ లక్షణాలు మామూలుగా ఉన్నవారు.. మానసికంగా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయాలి. కరోనా కారణంగా భయాందోళనలకు గురయ్యేవారు, సానుకూల దృక్పథంలో ఆలోచించాలి. మరికొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ఆ తరువాత పాత జీవనశైలికి అలవాటు పడవచ్చని భావించాలి. తీవ్రమైన లక్షణాలు ఉంటే మాత్రం, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి.

* సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని అలవాట్లు తోడ్పడతాయి. అవేంటంటే..

* ఆరోగ్యకరమైన నిద్ర
ప్రతికూల ఆలోచనల ప్రభావం కనిపించినప్పటి నుంచే, వాటి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి. ముఖ్యంగా రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రకు ఒక గంట ముందు నుంచి ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాలను పక్కన పెట్టాలి. దీనికి బదులుగా నచ్చిన పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా ఉంటుంది.

* డిజిటల్ డిటాక్స్
ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకాన్ని ఎప్పటికప్పుడూ సరిచూసుకోవాలి. రోజులో ఎంత సమయం ఇంటర్నెట్ వాడుతున్నారు, సోషల్ మీడియాతో ఎంత సమయం వృథా చేస్తున్నారు, ఎలాంటి విషయాలకు ఎక్కువ సమయం కేటాయించారు.. వంటి అంశాలను సరిచూసుకోవాలి. అనవసరమైన విషయాలకు కేటాయించే సమయాన్ని తగ్గిస్తూ, మానసిక ఉత్తేజాన్ని కలిగించే పనులపై దృష్టి పెట్టాలి.

* సృజనాత్మకను పెంచే అలవాట్లు
మెదడును చురుగ్గా ఉంచే అలవాట్లు, పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒంటరిగా ఉంటున్నామనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి, కొత్త అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. తోటపని, పెయింటింగ్ వేయడం, వంట చేయడం.. వంటి అనేక రకాల సృజనాత్మక ప్రయత్నాలను అన్వేషించవచ్చు. భావోద్వేగాలను నియంత్రించే పనులతో రూపొందిచే రోజువారీ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. వంద శాతం సంతృప్తినిచ్చే పనులతో రూపొందించే షెడ్యూల్ వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి.

* ఆహారపు అలవాట్లు
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అదేపనిగా ఇంట్లో ఉండేవారు ఎక్కువగా తినే అవకాశం ఉంది. ఇలాంటి వారు బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. పిండి పదార్థాలు, స్వీట్లు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తినడానికి బదులుగా.. ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో తినడం అలవాటు చేసుకోవాలి.

* నిపుణుల సాయం కోరడం
సమస్య తీవ్రంగా ఉన్నవారు మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవాలి. ఈ రోజుల్లో క్లినికల్ సైకాలజిస్ట్‌ల దగ్గర చికిత్స తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపట్లేదు. కానీ సమస్యను గుర్తించడం, వాటికి పరిష్కార మార్గాలను చూపించడం వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కనీసం ఒకటి, రెండు సెషన్లు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అందువల్ల అవసరమైతే నిపుణులను కలవడానికి వెనకాడవద్దు.
First published: