కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఓ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే నపుంసకత్వం వస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు. ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా. బీజేపీ తెచ్చిన కరోనా వ్యాక్సిన్ తాను వేసుకోబోనంటూ సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనగా మారింది. ‘కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ (యూపీలో) అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ను మేం నమ్మం. మా నాయకుడు అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం లేదంటే, దాని వెనుక కచ్చితంగా ఓ కారణం ఉంటుంది. దాని వెనుక కొన్ని నిజాలు ఉంటాయి. దాని వల్ల ప్రజలకు హాని కలగవచ్చు.’ అని సమాజ్ వాదీ పార్టీ నేత అయిన అశుతోష్ సిన్హా అన్నారు.
కరోనా వ్యాక్సిన్ నపుంసకుల్ని చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘అది మిమ్మల్ని నపుంసకులిగా చేస్తుంది. అఖిలేష్ యాదవ్ చెప్పారంటే అది కేవలం సమాజ్ వాదీ పార్టీ నేతలకు మాత్రమే కాదు. మొత్తం రాష్ట్రానికి కూడా. రాష్ట్రంలో ప్రజలు అందరూ కరోనా వ్యాక్సిన్‌కి దూరంగా ఉండండి.’ అని అశుతోష్ సిన్హా చెప్పారు.
అంతకు ముందు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కరోనా వ్యాక్సీన్‌పై తమకు నమ్మకం లేదని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరొక వ్యాక్సీన్ తెస్తామని అన్నారు. అప్పుడు అందరికీ ఉచితంగానే నాణ్యమైన వ్యాక్సీన్ అందజేస్తామని తెలిపారు. ''ప్రస్తుతానికైతే నేను వ్యాక్సీన్ వేసుకోను. బీజేపీ వ్యాక్సీన్‌ను ఎలా నమ్మాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ పంపిణీ చేస్తాం. బీజేపీ వ్యాక్సీన్‌ను మాత్రం తీసుకోం.'' అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. వ్యాక్సీన్ విషయంలోనూ రాజకీయాలు చేయడమేంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
అయితే, అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. ఇక ఇప్పటికే దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 02, 2021, 19:31 IST