కరోనా(corona) గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. టీకాలు వచ్చినా అందరికీ చేరేసరికి చాలారోజులే పట్టింది. మరోవైపు ఇండియాలో ఏడాదిన్నరగా చిన్నపిల్లలకు(children) టీకాలు అందుబాటులోకి రాలేదు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని దేశాల్లో పిల్లలకు టీకాలు(vaccine for children) వేయడానికి అక్కడి ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. అయితే వైద్య నిపుణుల నుంచి గుడ్‌న్యూస్ అందింది. భారత్‌లో కూడా చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్(vaccine) వేసే పనులు వేగవంతం అయ్యాయి. 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ Zycov-Dని Drugs Controller General of India (DCGI) ఆమోదం తెలిపింది. దీంతో ఈ సంవత్సరం అక్టోబర్ మొదటి వారం నుంచి పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. దేశంలో 12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు దాదాపు 12 కోట్ల మంది ఉన్నారు. అయితే ముందుగా కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు(critically ill children) టీకా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా పిల్లలు వచ్చే ఏడాది మార్చి(march) వరకు టీకా కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా పిల్లల మానసిక, శారీరక అభివృద్ధి కోసం పాఠశాలలు తెరవాలని కరోనాపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అభిప్రాయపడింది.
దేశంలో 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ Zycov-Dని Drugs Controller General of India (DCGI) ఆమోదించిందని అధికారులు తెలిపారు. జైడస్ కాడిలా(Zydus Cadila )కు చెందిన టీకా Zycov-D ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి పిల్లలకు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అక్టోబర్ మొదటి వారం నుంచి టీకాలు అందుబాటులోకి వస్తాయని జైడస్ కాడిలా కంపెనీ తెలిపిందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్ డాక్టర్ NK అరోరా అన్నారు. ఇప్పుడు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకాలు ఇస్తున్నారని, త్వరలో పిల్లలకు కూడా అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు.
డాక్టర్ NK అరోరా మాట్లాడుతూ.. ‘‘ అక్టోబర్ నుంచి 12 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న పిల్లలకు టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తారు. మిగతా వారికి తర్వాత ఇస్తారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ తీవ్ర అనారోగ్యాల జాబితా సిద్ధం చేస్తుంది. ఆ జాబితా ప్రకారం పిల్లలకు టీకాలు ఇవ్వబడుతాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి. అక్టోబర్ నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు టీకా ఇవ్వడం ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆరోగ్యకరమైన పిల్లలకు టీకా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆరోగ్యవంతమైన పిల్లలలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదం లేదా మరణించే ప్రమాదం చాలా తక్కువ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాధులతో బాధపడే వారు పిల్లలతో పోలిస్తే 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ఆసుపత్రిలో ఉండొచ్చు. మరణాలూ ఎక్కువే ఉండొచ్చు”అని అన్నారు.
పాఠశాలలపై స్పందిస్తూ..
‘‘పాఠశాలలు తెరవడానికి పిల్లలకు టీకాలు వేయవలసిన అవసరం లేదు. అవసరమైంది ఏంటంటే.. పిల్లలు తల్లిదండ్రులు, ఇతర పెద్దలందరి పర్యవేక్షణలో ఉంటారు. మరోవైపు పాఠశాలలో టీచర్, ఇతర సిబ్బంది ఉంటారు. ఈ విధంగా పిల్లలు సురక్షితమైన ప్రదేశంలోనే ఉంటారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధి కోసం పాఠశాలలు తెరవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు” అని అరోరా అన్నారు.
ZyCov-D వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సింగిల్ డోస్, డబుల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ZyCov-D వ్యాక్సిన్‌ను మాత్రం మొత్తం మూడు డోసుల్లో ఇస్తారు. ఒక్కో డోసు మధ్య 28 రోజుల విరామం ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌కు మరోక ప్రత్యేకత ఉంది. సూది అవసరం లేకుండానే ఈ టీకా ఇస్తారు. స్పింగ్ పవర్‌తో పనిచేసే ఒక రకమైన డివైజ్ ద్వారా వ్యాక్సిన్‌ను చర్మం లోపలి పొరల్లోకి పంపిస్తారు. మిగతా వ్యాక్సిన్లను శరీర కండరాల్లోకి సూది ద్వారా ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central governmennt, Children, Corona, Covid vaccine, COVID-19 vaccine