Covid Vaccine: కోవిడ్ టీకా సెకండ్ డోస్ ఎప్పుడు వేసుకోవాలి? డోస్‌ల విరామంపై ఎందుకీ రచ్చ?

ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccine: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. అయితే మే 13న దీన్ని 12-16 వారాలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) సిఫారసు చేసినట్లు కేంద్రం తెలిపింది.

  • Share this:
భారత్‌లో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తోంది. ఈ క్రమంలో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన అధ్యయనాలు, దేశీయ పరిశోధనలు, శాస్త్రీయ డేటా ఆధారంగానే, టీకాల మధ్య విరామాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే భారత ప్రభుత్వం నియమించిన శాస్త్రవేత్తల బృందంలోని కొందరు నిపుణులు మాత్రం.. ఈ నిర్ణయాన్ని సమర్థించే డేటా అందుబాటులో లేదని మంగళవారం వెల్లడించారు. ఈ వివరాలను ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్‌ వార్తాసంస్థకు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బుధవారం వివరణ ఇచ్చారు. శాస్త్రీయ డేటా ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతకు ముందు వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంపు నిర్ణయాన్నిఎన్‌టీఏజీఐ ఛైర్మన్‌ డాక్టర్ ఎన్‌కే అరోరా కూడా సమర్థించడం గమనార్హం.

ఇంతకు ముందు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. అయితే మే 13న దీన్ని 12-16 వారాలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) సిఫారసు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ బృందంలో మొత్తం 14 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరిలో ముగ్గురు శాస్త్రవేత్తలు మాత్రం, ఇలాంటి సిఫార్సు చేయడానికి ఎలాంటి డేటా అందుబాటులో లేదని రాయిటర్స్‌కు చెప్పారు.

ఈ ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ మాజీ డైరెక్టర్ M.D. గుప్తే ఒకరు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘టీకా డోసుల మధ్య విరామాన్ని 8-12 వారాలకు పెంచడానికి NTAGI మద్దతు ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే సలహా ఇచ్చింది. కానీ ఈ వ్యవధి 12 వారాలకు మించి ఉండాలనే వాదనకు బలం చేకూర్చే డేటా లేదు. ఎనిమిది నుంచి 12 వారాల వ్యవధి అందరికీ అంగీకారమే. కానీ దీన్ని 12 నుంచి 16 వారాలకు పెంచడం సరికాదు. ఇది సరైన నిర్ణయమే కావచ్చు. కానీ దీన్ని ధ్రువీకరించే డేటా మాత్రం మనకు అందుబాటులో లేదు’ అని వివరించారు. NTAGI బృందంలో సభ్యుడైన మాథ్యూ వర్గీస్ సైతం ఈ వాదనను సమర్థించారు.

గత నెలలో వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. NTAGI వర్కింగ్ గ్రూప్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో NTAGI సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు లేవని సైతం పేర్కొంది. టీకాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. ఇది శాస్త్రీయ నిర్ణయమని పునరుద్ఘాటించింది. వ్యాక్సిన్ డోసుల విరామాన్ని పెంచడంపై NTAGIలో చర్చలు జరిగాయని చెబుతున్నారు సెవెన్ స్ట్రాంగ్ కోవిడ్ వర్కింగ్ గ్రూపు సభ్యుడు జె.పి.ములియిల్. అయితే సంస్థ దీన్ని 12-16 వారాలుగా ఉండాలని సిఫారసు చేయలేదని తెలిపారు.

ఆ అధ్యయనం ఆధారంగానే నిర్ణయం?
ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకా డోసులపై దక్షిణ కొరియా గత నెలలో ఒక అధ్యయనం చేపట్టింది. 60, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ రెండు కంపెనీల వ్యాక్సిన్లు ఒక డోసు తీసుకున్నా.. అవి 86.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన ఆధారంగా.. రెండో డోసు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తల సలహా బృందం భావించి ఉండవచ్చని ములియిల్ చెబుతున్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేంద్రం స్పందనపై విమర్శలు చేసి, ప్రభుత్వ ప్యానెల్ నుంచి వైదొలిగిన వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ సైతం ఈ విషయంపై స్పందించారు. రెండు డోసుల మధ్య విరామాన్ని రెట్టింపు చేయడానికి కారణాలను అధికారులు స్పష్టం చేయాలని చెప్పారు. వివిధ రకాల వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో, టీకాలతో ప్రజలకు రక్షణ కల్పిస్తామనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశంలో ప్రజలకు అందిస్తున్న వ్యాక్సిన్లలో 90 శాతం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్ టీకాలే ఉన్నాయి. కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో కొత్త వైరస్ వేరియంట్‌ వ్యాప్తిపై ప్రభుత్వం ముందుగా స్పందించి ఉంటే, ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కాదని కొందరు శాస్త్రవేత్తలు విమర్శించారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచడంతో, ఈ నిర్ణయంపై వివాదం చెలరేగింది.

అయితే ఈ విషయంపై మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బుధవారం వివరణ ఇచ్చారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల విరామం పెంపు నిర్ణయాన్ని పారదర్శకంగా తీసుకున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన శాస్త్రీయ డేటాను విశ్లేషించే పటిష్ట వ్యవస్థ మన దేశంలో ఉందన్నారు. ఇలాంటి విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published: