దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మొదటా భారత ప్రధాని నరేంద్ర మోదీ టీకా తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వయసు 70 ఏళ్లు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేస్తుండడంతో ఆయన కూడా టీకా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పుదుచ్చేరికి చెందిన నర్సు పి. నివేద వ్యాక్సిన్ షాట్ వేశారు. ఆమెతో పాటు కేరళకు చెందిన మరో నర్సు రోసమ్మ అనిల్ సాయం చేశారు.
''భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోస్‌ను ప్రధాని మోదీకి వేశాం. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తాం. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారని మమల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక.. అప్పుడే అయిపోయిందా..అస్సలు తెలియలేదని ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.'' అని ప్రధానికి టీకా వేసిన నర్సు పి. నివేద పేర్కొన్నారు.
Sir (PM Modi) has been administered first dose of Bharat Biotech's Covaxin, second dose will be given in 28 days. He asked us where do we belong to & after vaccination he said, "Laga bhi di, pata hi nahi chala": Sister P Niveda who inoculated PM Modi today.
— ANI (@ANI) March 1, 2021
(Source: DD) pic.twitter.com/QzIF2PaT15
తాను తొలి డోసు వ్యాక్సిన్ పొందినట్లు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా తెలిపారు. కరోనాకి వ్యతిరేకంగా మన దేశ డాక్టర్లు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అర్హులందరూ కరోనా టీకా తీసుకోవాలని కోరారు. మనమందరం కలిసి భారత్‌ను కరోనా లేని దేశంగా తీర్చిదిద్దుదామని మోదీ పిలుపు ఇచ్చారు.
మనదేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌ల వినియోగంలో ఉన్నాయి. పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న ప్రధాని.. అందుకే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కొవాగ్జిన్ టీకాను వేయించుకున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా భారత్‌కు చెందిన కంపెనీయే అయినప్పటికీ.. ఆ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 10వేల ప్రభుత్వ వ్యాక్సినేషన కేంద్రాలు, 20వేల ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నేటి నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా టీకా వేస్తారు. ఐతే ఉచితం కాదు. ఒక్క డోస్‌కు రూ.250 చెల్లించాలి. వ్యాక్సిన్ ధర రూ.150 కాగా.. సర్వీస్ చార్జీ రూ.100. ఇంతకంటే ఎవరూ ఎక్కువగా వసూలు చేయకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine, PM Narendra Modi