Covid Restrictions: ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీలో ఆంక్షలు.. దయచేసి రావొద్దు.. కాదని వెళ్లారో..

Covid Restrictions: ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీలో ఆంక్షలు.. దయచేసి రావొద్దు.. కాదని వెళ్లారో..

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఎన్‌440కే స్ట్రెయిన్‌ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ కొత్త రకం వైరస్ వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న అన్ని వేరియెంట్ల కంటే ఇది 15 రెట్లు ప్రమాదకరమని సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఐతే ఇందులో నిజంలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

 • Share this:
  కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్‌డౌన్ పెట్టి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న కేజ్రీవాల్ సర్కార్.. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరూ ఢిల్లీకి రాకూడదని విజ్ఞప్తి చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ చట్టం కింద కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏపీ, తెలంగాణలో విస్తృతంగా వ్యాపించే కొత్త కరోనా వేరియంట్‌ను కనుగొన్నారని, ఆ వైరస్‌కు ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ తక్కువగా, ఇన్ఫెక్షన్‌ వేగం ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ముందు జాగ్రత్తచ ర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

  ఢిల్లీకి చేరుకునే సమయానికి ముందు (72 గంటల్లోపు) ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుని, నెగెటివ్‌ సర్టిఫికెట్‌తో వచ్చేవారు కూడా ఏడు రోజుల పాటు ఏడు రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఏపీ, తెలంగాణ నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ మీదుగా రోడ్డు మార్గంలో వేరే రాష్ట్రాలకు వెళ్లవచ్చు. ఐతే మధ్యలో ఢిల్లీలో దిగకూడదు. ఆగకూడదు. ఐతే ఎంపీలు, కేంద్రమంత్రులు, ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉండేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు. ఎలాంటి లక్షణాలు లేకుంటే ఢిల్లీకి అనుమతిస్తారు.


  ఏపీలో ఎన్‌440కే స్ట్రెయిన్‌ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ కొత్త రకం వైరస్ వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న అన్ని వేరియెంట్ల కంటే ఇది 15 రెట్లు ప్రమాదకరమని సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఐతే ఇందులో నిజంలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియెంట్ విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది మరీ అంత ప్రమాదకరమేమీ కాదని సీసీఎంబీ కూడా తెలిపింది. ఈ వైరస్‌ను గత ఏడాది జూన్‌-జూలైలోనే గుర్తించారని.. అది కొత్తగా పుట్టుకొచ్చింది కాదని కొవిడ్‌ నిరోధక కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు.


  అటు కేంద్రం కూడా కొత్త వేరియెంట్‌పై ఆందోళన అవసరం లేదని తెలిపింది. ఏపీలో కొత్త రకం వైరస్ అనేది లేదని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్ వెల్లడించారు. ఎన్440కే రకం వైరస్ ప్రభావం అసలు దేశంలోనే ఎక్కడా కన్పించలేదని చెప్పారు. మనదేశంలో బీ 1617 వైరస్ ప్రభావం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్తగా.. ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది.


  కాగా, ఏపీలో గురువారం కొత్తగా 21954 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 110147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 72 మంది కోవిడ్‌కు బలయ్యారు.కొత్తగా 10141 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 182329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 17060446 కరోనా పరీక్షలు నిర్వహించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: