హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Vasai Fire Accident: కరోనా ఆస్పత్రిలో మంటలు..13 మంది రోగులు మృతి.. మహారాష్ట్రలో మరో ఘోరం

Vasai Fire Accident: కరోనా ఆస్పత్రిలో మంటలు..13 మంది రోగులు మృతి.. మహారాష్ట్రలో మరో ఘోరం

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

అర్ధరాత్రి దాటిన తర్వాత ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అందరూ నిద్రలో ఉండడం.. మంటలు వేగంగా వ్యాపించడంతో.. రోగులు బయటకు వెళ్లేకపోయారు. మంటల్లో చిక్కుకొని కొందరు.. పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు

  మహారాష్ట్రలో మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే కరోనా కాటుకు నిత్యం వందల మంది మరణిస్తున్నారు. దీనికి తోడు ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాలు కూడా రోగుల ప్రాణాలు తీస్తున్నాయి. నాసిక్‌లో ఆక్సీజన్ ట్యాంకర్ లీకై 24 మంది మరణించిన ఘటనను మరవక ముందే.. మరో ఘోరం జరిగింది.  పాల్‌ఘఢ్ జిల్లాలోని విరార్‌లో ఓ కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఈ దుర్ఘటనలో 13 మంది రోగులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

  వాసయ్ విరార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐతే అర్ధరాత్రి దాటిన తర్వాత ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అందరూ నిద్రలో ఉండడం.. మంటలు వేగంగా వ్యాపించడంతో.. రోగులు బయటకు వెళ్లేకపోయారు. మంటల్లో చిక్కుకొని కొందరు.. పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం 13 మంది రోగులు మరణించారు. ఆస్పత్రిలో ఫర్నిచర్, ఇతర సామాగ్రి మొత్తం కాలి బూడిదయింది.  ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఐతే ఐసీయూలో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయా? లేదంటే ఇంకేదైనా కారణముందా? అనే కోణాలో దర్యాప్తు చేస్తున్నారు.

  కాగా, బుధవారం నాసిక్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 24 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆక్సీజన్ ట్యాంకర్ లీక్ కావడంతో.. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సీజన్ అందక.. ఊపిరాడక.. రోగులు పిట్టల్లా రాలిపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా 24 మంది ప్రాణలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. నాసిక్ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉందని.. ఘటనకు వారే బాధ్యత వహిచాలని శివసేన నేతలు విమర్శిస్తున్నారు. లేదు మీవల్లే ఘోరాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, Fire Accident, Maharashtra

  ఉత్తమ కథలు