కరోనా చికిత్స ఫీజును రూ.70వేలకు పెంచాలి.. ప్రైవేట్ ఆస్పత్రుల డిమాండ్

ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి ఈటల భేటీ

తెలంగాణలో ఇప్పటి వరకు 5675 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జ్ కాగా.. 192 మరణించారు.

 • Share this:
  రోజుకు రూ.70 వేల ఫీజు చెల్లిస్తే తప్ప కరోనా చికిత్స అందించలేమని ప్రైవేట్ ఆస్పత్రులు స్పష్టం చేశాయి. కరోనా రోగులకు చికిత్స ఇవ్వడంతో తాము రాజీపడడం లేదని.. కానీ ప్రభుత్వ నిర్ణయించిన ఫీజులతో ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. గురువారం మంత్రి ఈటెల రాజేందర్‌తో ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. కరోనా ఫీజుల గురించి ఆయనతో చర్చించారు. ఐతే ఫీజులను భారీగా పెంచితే గానీ.. కరోనా రోగులకు నాణ్యమైన చికిత్స అందించలేమని అసోసియేషన్ సెక్రటరీ మోహన్ గుప్తా అన్నారు. ఐతే వీలైనంత వరకు ప్రజా సేవ చేయాలని.. పేదల ఆరోగ్యం విషయంలో రాజీపడబోమని మంత్రి ఈటల అన్నట్లు సమాచారం.

  ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు వైద్యం అందించే బాధ్యత ప్రైవేట్ ఆస్పత్రులపై ఉంది. ప్రజలకు వైద్యం అందించడానికి సహకరించాలని అసోసియేషన్ ప్రతినిధులను విజ్ఞప్తి చేశాం. కొంతమంది కరోనా పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరి కాదు. కరోనా పాజిటివ్ ఉన్నా కూడా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందించాలి. లక్షణాలు లేనివారికి హోమ్ ఐశోలేషన్ ఉంచాలి. ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్స అందించేందుకు అనుమతినిచ్చాం. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కర్తవ్యంగా భావించి చికిత్స అందించాలి. ఐసీ యు లోనున్న పేషెంట్లకు ప్రభుత్వం రేట్ల ప్రకారమే చికిత్స అందించాలి. పిపీఈ కిట్స్ వినియోగం, మందుల వినియోగం కి అయ్యే ఖర్చు నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నే తీసుకోవాలి.
  ఈటల రాజేందర్


  రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో టెస్ట్‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ల్యాబ్స్‌లోనూ కరోనా పరీక్షలకు ఇటీవల అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి సోమవారం చార్జీలు ఖరారు చేసింది. ప్రైవేట్ లాబ్‌లో కరోనా పరీక్షకు గరిష్టంగా రూ.2200 వసూలు చేస్తారు. ఇక సాధారణ ఐసోలేషన్ ఛార్జి రోజుకు రూ.4000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూ ఛార్జి రోజుకు రూ.7500, వెంటిలేటర్‌తో ఐసీయూలో ఛార్జి రోజుకు రూ.9000గా ఖరారు చేశారు. ఇక యాంటీ వైరల్ మందులు వాడితే ఛార్జి అదనంగా ఉంటుంది. ఐతే ఈ రేట్లతో తాము చికిత్స ఇవ్వలేమంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.


  కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 5675 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జ్ కాగా.. 192 మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published: