Covid Third wave: చిన్నారులకు కొవిడ్‌-19 ఎక్కువ ప్రమాదకరమా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సోకిన పిల్లలు చాలావరకు అసింప్టమేటిక్‌గానే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యం పదేళ్ల లోపు పిల్లలకు కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, కొద్దిపాటి జ్వరం, డయేరియా లాంటి లక్షణాలు వస్తున్నాయి.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే మరోవైపు మూడో వేవ్‌ త్వరలో వచ్చేస్తుందని శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ వేవ్‌లో చిన్నారులు ఎక్కువ ప్రభావితులు అవుతారని కూడా చెబుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం!

పిల్లలపై కరోనా ప్రభావం రెండు వేవ్‌ల్లోనూ ఒకేలా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన జాతీయ సీరో సర్వేలో 25 శాతం మంది చిన్నారులకు కొవిడ్‌ సోకిందని తేలింది. ఇందులో మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే సింప్టమేటిక్ అని జాతీయ డేటా చెబుతోంది. తొలి రెండు వేవ్‌ల విషయంలోనూ ఈ లెక్కలు ఇలానే ఉన్నాయి. దీంతో సెకండ్‌ వేవ్‌లో పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడ్డారని చెప్పలేం అని చెబుతున్నారు.

కరోనా సోకిన పిల్లలు చాలావరకు అసింప్టమేటిక్‌గానే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యం పదేళ్ల లోపు పిల్లలకు కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జలుబు, కొద్దిపాటి జ్వరం, డయేరియా లాంటి లక్షణాలు వస్తున్నాయి. ఈ క్రమంలో త్వరగానే కోలుకుంటున్నారు. అయితే ఇతర అనారోగ్యాలు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రం చాలా సమస్య అవుతోందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొంతమంది చిన్నారుల్లో కరోనా సోకిన రెండో వారంలో మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌) వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించి వైద్యం అందించాలంటున్నారు.

కోవిడ్ సోకిన పిల్లలకు ఎలాంటి వైద్యం చేయించాలి?
పెద్దలకు పిల్లలకు మధ్య వైద్యంలో తేడా ఉంటుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే కరోనా వైద్యంలో పిల్లలు, పెద్దలు అనే తేడా ఉండదంటున్నారు వైద్యులు. లక్షణాలు లేనివారికి పెద్దగా మందులు అవసరం లేదు. ఇలాంటి వారికి కేవలం పారాసెటమాల్‌తోనే తగ్గిపోతుందని వైద్యులుచెబుతున్నారు. డయేరియా సమస్య వస్తే దానికి తగ్గట్టుగా రీహైడ్రేట్‌ ఫ్లూయిడ్స్‌, ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం లాంటివి సూచిస్తారు. ముందుగా చెప్పుకున్నట్లు ఇతర అనారోగ్యాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం ఉత్తం. ముందుగా గుర్తిస్తే పిల్లలో ఎంఐఎస్‌ సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చు.

పిల్లలకు కరోనా సోకినప్పుడు వాళ్లను చూసేవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కచ్చితంగా డబుల్‌ మాస్క్‌ ధరించాలి. ఫేస్‌మాస్క్‌, గ్లోవ్‌లు ధరించడం తప్పనిసరి. దాంతోపాటు పిల్లలను చూసుకునే వ్యక్తి కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: