హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

AP Corona update: ఏపీలో మళ్లీ భయం భయం: తిరుపతి వేద పాఠశాలను వదలని కరోనా: కర్నూల్లో స్కూళ్లు మూసివేత!

AP Corona update: ఏపీలో మళ్లీ భయం భయం: తిరుపతి వేద పాఠశాలను వదలని కరోనా: కర్నూల్లో స్కూళ్లు మూసివేత!

ఏపీలో మళ్లీ కరోనా భయం

ఏపీలో మళ్లీ కరోనా భయం

ఏపీని మళ్లీ కరోనా భూతం భయపెడుతోంది. రోజు రోజకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, చిత్తూరుల్లో పరిస్థితి లాక్ డౌన్ పరిస్థితులను గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే.. కరోనా రక్కసిని ఆహ్వానించేవారవుతారు.

ఇంకా చదవండి ...

అంతా బాగుంది అనుకుంటే మళ్లీ కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు జోరుగా వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. కేసులు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 261 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 41 మందికి కరోనా సోకింది. మొత్తం 23వేల 417 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 261 మందికి పాజిటివ్‌గా తేలింది. 125 పూర్తిగా కోలుకున్నారు. దీంతో కేసుల సంఖ్య 8,89,374కి పెరిగాయి.

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలో చానాళ్లుగా 10 లోపు కేసులే నమోదవుతుండగా, ఆదివారం వారం నుంచి ప్రతి రోజు కేసుల సంఖ్య 40కి పైగా వస్తుండడం ఆందోళన పెంచుతోంది. ఇదే పరిస్థితి ఉంటే మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుంది. ఇటీవల పొన్నూరు పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది.

ఇటు తిరుమల వేదపాఠశాలలో కరోనా కేసులు ఆగడం లేదు. సోమవారం ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వేదపాఠశాలకు టీటీడీ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో 357 మంది విద్యార్థులు సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. మార్చి 10న వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూడటంతో.. సోమవారం 75 మందికి కరోనా టెస్టులు చేయగా.. మరో 10 మందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి వేద పాఠశాలలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 420 మంది విద్యార్థులు వేదాలను అభ్యసిస్తున్నారు.

ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు. రెండు రోజలు క్రితం స్కూల్ లో చదివే ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో యాజమాన్యం పాఠశాల మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బడిలో 400 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి అజాగ్రత్తల వల్ల వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీల్లో లాక్ డౌన్ విధించారు. గ్రామంలో కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలను మూసివేసిన అధికారులు.. గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల గ్రామంలో పది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కమ్మపల్లి పంచాయతీలో 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పక్కనే ఉన్న గంగిరెడ్డి పల్లె పంచాయతీలో ఒక కేసు నమోదైంది.

టెస్టుల్లో పాజిటివ్ గా నమోదైన వారిని ఐసోలేషన్ కు తరలించారు. కొంతమందికి హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలోకి ఎవర్నీ రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. రామచంద్రాపురం ఎమ్మార్వో, పోలీసులు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. రోజు రోజుకూ ఈ మూడు జిల్లాల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Corona, Corona Possitive, Corona Vaccine, Corona virus

ఉత్తమ కథలు