కరోనాతో చనిపోయిన వారి పట్ల ఎలాంటి బేధభావం చూపొద్దని, వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలంటూ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అధికారులను ఆదేశించినా కూడా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే అతడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. బాపట్లలో కోవిడ్ మృతుని పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి కి సంబంధించిన ఫొటో వెలుగులోకి వచ్చింది. కరోనాతో మరణించిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కరోనా మృతదేహానికి కనీసం ప్యాక్ చేయాల్సి ఉన్నా కనీసం ఆస్పత్రి సిబ్బంది పాటించలేదని ఆరోపిస్తున్నారు. కరోనా మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో రావవడం చూసిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధికారులకు ఫోన్ చేశారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కోన రఘుపతి కూడా కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,597 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మరో 93 మంది మరణించారు. గుంటూరులో 13 మంది, ప్రకాశంలో 11, చిత్తూరులో 10 మంది, నెల్లూరులో పది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మరణించారు.
తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. కరోనాను జయించి వీరిలో 1,61,425 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,296 మంది మరణించారు. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 57,148 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 26,49,767 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.