Coronavirus: దేశంలో రాబోయేది ఆర్థిక సునామీ...లాక్ డౌన్ తో రోజుకు ఎంత నష్టమంటే...

Coronavirus: మూడు వారాల దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ కారణంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యిందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మందగమనం బాటలో ఉన్న భారత్ కు కరోనా దెబ్బతో రూ.9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 26, 2020, 7:37 AM IST
Coronavirus: దేశంలో రాబోయేది ఆర్థిక సునామీ...లాక్ డౌన్ తో రోజుకు ఎంత నష్టమంటే...
లాక్‌డౌన్ ఎఫెక్ట్... (File)
  • Share this:
Coronavirus: కరోనా వైరస్ దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుందని గణాంకాలు వెలువడుతున్నాయి. మూడు వారాల దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ కారణంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యిందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మందగమనం బాటలో ఉన్న భారత్ కు కరోనా దెబ్బతో రూ.9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఈ మొత్తం దాదాపు భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది. మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల నష్టమే రూ.6.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దీంతోపాటు 2020–21 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతంగా ఉంటుందని బార్‌క్లేస్‌ పేర్కొంది. ఇక ఆర్బీఐ మానిటరీ పాలసీ భేటీలో కీలక వడ్డీ రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఏడాది దాదాపు ఒక శాతం మేర తగ్గించే అవకాశం లేకపోలేదనే అంచనాలు వేసింది. ద్రవ్యలోటు 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు లేవని మరో బ్రోకరేజీ సంస్థ ఎడిల్వీజ్ తెలిపింది. ఇప్పటికే డీమోనిటైజేషన్, జీఎస్‌టీ నిర్ణయాలతో అసంఘటిత రంగం కుదేలు కాగా, ఇప్పుడు తాజాగా కరోనాతో మరింత కష్టాల్లోకి నెట్టేసిందని పేర్కొంది.

మరో సంస్థ కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో లాక్ డౌన్ కారణంగా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని వివరించింది. నిత్యావసర సేవలు, వ్యవసాయ రంగంలో 20 శాతం ఉత్పత్తి మందగిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది. మొత్తంగా రూ.6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల కోట్ల వరకూ ఎకానమీ దెబ్బతింటుందని అంచనావేసింది. 2019–20 లో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.140 లక్షల కోట్ల నుంచి రూ. 150 లక్షల కోట్ల వరకే ఉంటుందని అంచనావేసింది. పరిస్థితి చూస్తుంటే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) మైనస్‌లోకి వెళ్లే అవకాశంలేదుకానీ, 1.5–2.5 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు