CORONA HEALTH INSURANCE THESE ARE THE 4 REASONS FOR YOUR COVID 19 HEALTH INSURANCE CLAIM TO BE REJECTED GH SK
Health Insurance: కరోనా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించడానికి కారణాలివే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రతీకాత్మక చిత్రం
కరోనా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణ గురించి పాలసీదారుల నుండి ఐఆర్‌డీఏకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, భీమా సంస్థలు మాత్రం క్లెయిమ్ తిరస్కరణకు కొన్ని కారణాలు చూపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం
కరోనా మహమ్మారి కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు ఇన్సూరెన్స్‌లను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అత్యవసరంగా మారింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను తిరస్కరిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కోసమే ప్రవేశపెట్టిన కరోనా కవచ్, కరోనా రక్షక్ వంటి స్వల్పకాలిక కోవిడ్ పాలసీల విషయంలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో క్లెయిమ్ తిరస్కరణ గురించి పాలసీదారుల నుండి ఐఆర్‌డీఏకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, భీమా సంస్థలు మాత్రం క్లెయిమ్ తిరస్కరణకు కొన్ని కారణాలు చూపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స
స్వల్పకాలిక లక్షణాలతో కోవిడ్ బారీన పడ్డ వారు ఇంట్లోను ఉండి చికిత్స తీసుకోవచ్చు. అయితే, కొంతమంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకున్నా సరే ఆసుపత్రుల్లో చికిత్స తీసుకొని క్లెయిమ్ కోసం అభ్యర్థిస్తున్నారని బీమా సంస్థలు వాదిస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌లో సీటీ వాల్యూ ఎక్కువగా ఉన్న సందర్భంలోనే ఆసుపత్రుల్లో చేరాలని, లేదంటే హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స చేసుకోవాలని పాలసీదారులకు సూచిస్తున్నాయి. అందువల్ల, రోగి ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని ఊహించి క్లెయిమ్లను తిరస్కరిస్తున్నాయి. దీనిపై పాలసీదారుల నుంచి ఐఆర్‌డీఏఐకి పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు అందుతున్నాయి. తాము ఆసుపత్రుల్లో చేరాలా? లేదా? అనేది భీమా సంస్థలు ఎలా నిర్ణయిస్తాయని పాలసీదారులు వాదిస్తున్నారు.
RT-PCR టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినప్పటికీ చికిత్స
కొంత మంది పాలసీదారులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని బీమా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఆర్టీపీసీర్ టెస్ట్ రిజల్ట్‌లో నెగెటివ్ వచ్చినంత మాత్రాన కరోనా లేదని నిర్ధారించలేమని పాలసీదారులు అంటున్నారు. డాక్టర్ల సూచనల మేరకే తాము ఆసుపత్రుల్లో చేరుతున్నామని, అయినా దీన్ని సాకుగా చూపి బీమా సంస్థలు పాలసీ క్లెయిమ్లను తిరస్కరిస్తున్నాయని పాలసీదారులు వాపోతున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోకపోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటే కరోనా అనుమానిత కేసుగా పరిగణించాలని ఐసిఎంఆర్ సూచించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
డాక్యుమెంట్ల సమర్పణలో ఆలస్యం
కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన వెంటనే వారి కుటుంబ సభ్యులు సంబంధిత బీమా సంస్థకు తెలియజేయాలి. అయితే, చాలా మంది ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు క్లెయిమ్ కోసం కొందరు ఆలస్యంగా దరఖాస్తు చేస్తున్నారు. దీన్ని సాకుగా చూపి బీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరిస్తున్నాయి. అందువల్ల, రీయింబర్స్మెంట్ కోసం సకాలంలో క్లెయిమ్ ఫారంతో పాటు డిశ్చార్జ్ ప్రూఫ్‌లు, మెడిసిన్, డయాగ్నొస్టిక్ బిల్లులను బీమా సంస్థకు అందజేయాలి. IRDAI ఆరోగ్య బీమా నిబంధనల ప్రకారం, డాక్యుమెంట్ల సమర్పన ఆలస్యం కావడానికి సరైన కారణాలు ఉన్నప్పుడు బీమా కంపెనీలు వాటిని తిరస్కరించరాదు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ తిరస్కరణ
కరోనా రోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించడానికి అనేక ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. తద్వారా, పాలసీదారుడే తన సొంత నిధుల నుండి ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఆసుపత్రుల నియంత్రణ IRDAI పరిధిలోని అంశం కాదు. కాబట్టి, ఆసుపత్రులు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించకపోతే ఫిర్యాదు చేసినా పెద్దగా లాభం ఉండకపోవచ్చు. అందువల్ల, క్యాష్ లెస్ ట్రీట్మెంట్పై పూర్తిస్థాయిలో ఆధారపడకుండా ముందస్తుగా కార్పస్ ఫండ్ సిద్ధం చేసుకోవాలి. అంతేకాక, 9 నుండి-12 నెలల పాటు మీ గృహ అవసరాలు తీర్చగలిగే అంత డబ్బు సిద్దం చేసుకోవడం మంచిది.