news18-telugu
Updated: April 9, 2020, 6:31 AM IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (Photo: WHO Website)
అగ్ర దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.. చిన్న దేశాలు చితికిపోతున్నాయి.. బలమున్నా, లేకున్నా బలి కావాల్సిందే.. పేదోడు అన్న కనికరం లేదు.. పెద్దోడు అన్న భయం లేదు.. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ మహమ్మారి ముందు మోకరిల్లాల్సిందే. ఇదీ.. కరోనా చేస్తున్న మారణకాండ. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ రోజు రోజుకు తీవ్రంగా తయారవుతోంది. చూస్తుండగానే శరీరాన్ని ఆవహించి, చిన్నాభిన్నం చేసేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచ దేశాలు మంచమెక్కాయి. ఆస్పత్రులు స్మశానాలుగా మారుతున్నాయి. ఆర్థిక రంగం ఆగమాగం అవుతోంది. ఎంత దారుణంగా తయారైందంటే.. అమెరికాలో ఒక్క రోజే 1895 మందిని బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,13,243. అటు 88,403 మంది మృత్యువాతపడ్డారు.
అమెరికాలో 4,30,210 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజే 1895 మంది మరణించారు. ఆ తర్వాత స్థానంలో స్పెయిన్(1,48,220), ఇటలీ (1,39,422), జర్మనీ (1,13,296), ఫ్రాన్స్ (1,12,950), చైనా (81,802) ఉన్నాయి. మరణాల వారీగా చూస్తే.. అమెరికా తర్వాత యూకేలో 938, స్పెయిన్ 747, ఇటలీ 542, ఫ్రాన్స్ 541, జర్మనీ 333, బెల్జియం 205, నెదర్లాండ్స్ 147, బ్రెజిల్ 134, ఇరాన్ 121 మరణాలు చోటుచేసుకున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,29,731 మంది కరోనా బంద విముక్తులయ్యారు. 48,078 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
April 9, 2020, 6:31 AM IST