Corbevax: త్వరలోనే మార్కెట్లోకి కోర్బెవాక్స్ టీకా.. ఇతర వ్యాక్సిన్‌లతో పోలిస్తే ఏంటి దీని ప్రత్యేకత?

ప్రతీకాత్మక చిత్రం

కోర్బెవాక్స్​ సింగిల్​ డోస్ ధర కేవలం రూ.250 మాత్రమే ఉండనుంది. అంటే, మొత్తం రెండు డోసులకు కలిపి రూ.500 మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం భారత్​లో అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువని చెప్పవచ్చు.

  • Share this:
దేశంలో కరోనా కట్టడికి ఏకైక మార్గంలా భావిస్తున్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కోవాగ్జిన్​, కోవిషీల్డ్​ వ్యాక్సిన్​లను అందిస్తున్నారు. వీటికి తోడుగా అతి త్వరలోనే మరో దేశీయ వ్యాక్సిన్​ చేరనుంది. హైదరాబాద్​కు చెందిన బయోలాజికల్​ ఇ ఫార్మా సంస్థ అభివృద్థి చేసిన కోర్బెవాక్స్​ అనే వాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి చేసుకోని కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇది అన్ని రకాల అనుమతులు పొంది మార్కెట్​లోకి వస్తే ఇప్పుడున్న ఇతర వాక్సిన్లలో కెల్లా అత్యంత చౌకైన వ్యాక్సిన్​ కానుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ కోర్బెవాక్స్​ సింగిల్​ డోస్ ధర కేవలం రూ.250 మాత్రమే ఉండనుంది. అంటే, మొత్తం రెండు డోసులకు కలిపి రూ.500 మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం భారత్​లో అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువని చెప్పవచ్చు.

అందుకే, భారత ప్రభుత్వం బయాలాజికల్ ఇ ఫార్మా సంస్థతో ఒప్పందం చేసుకుంది. 30 కోట్ల టీకాలకు ముందస్తు ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీకి అడ్వాన్స్​గా రూ.1500 కోట్లు సమకూర్చనుంది. అసలు ఈ వ్యాక్సిన్​ ఎలా పనిచేస్తుంది? ఇతర వ్యాక్సిన్లకు దీనికి తేడాఏంటి? ఇది వ్యాక్సిన్ల కొరత తీర్చనుందా? అనే అంశాలను పరిశీలిద్దాం.

కార్బెవాక్స్ ఎలా పనిచేస్తుంది?
కార్బెవాక్స్ SARS-CoV-2 వైరస్​కు వ్యతిరేకంగా రూపొందించబడింది. సాధారణంగా వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కరోనా సోకుతుంది. అందువల్ల, స్పైక్ ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డకునేందుకు ఈ వ్యాక్సిన్​ను రూపొందించారు. వైరస్ మన శరీరానికి ప్రవేశించే క్రమంగా ఈ కార్బెవాక్స్​ రక్షణ వలయంగా నిలుస్తుంది. తద్వారా కరోనా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ల తయారీకి ఉపయోగించిన ఫార్ములానే ఈ వాక్సిన్​ తయారీలో కూడా ఉపయోగించారు.

దీన్ని ఎలా తయారు చేశారు?
ఈ వ్యాక్సిన్​ దేశీయంగా ఉత్పత్తి చేయబడినప్పటికీ, వ్యాక్సిన్​పై పరిశోధన కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ పరిధిలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారం తీసుకున్నారు. ఈ టీకా తయారీ కోసం గతేడాది ఆగస్టులో బిసిఎం తన ప్రొడక్షన్ సెల్ బ్యాంక్‌ను బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థకు బదిలీ చేసింది. దీని సహకారంతో ఇప్పటికే మొదటి రెండు దశల క్లినికల్​ ట్రయల్స్​ దిగ్విజయంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం, మూడో దశ క్రినియల్​ ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు. జూలై చివరి నాటికి ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. క్లినికల్​ ట్రయల్స్​ విజయవంతమైతే త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

బయోలాజికల్ ఇ ఫార్మా గురించి..

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థను 1953లో డాక్టర్ డి వి కె రాజు స్థాపించారు. 1962లోనే ఇది వ్యాక్సిన్ల తయారీలోకి ప్రవేశించింది. ఎన్నో వ్యాధుల నిర్మూలనకు పెద్ద ఎత్తున డిపిటి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసింది. తద్వారా భారతదేశంలోని ప్రధాన వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ ప్రపంచంలోనే “అతిపెద్ద” టెటానస్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా పేరొందింది. ఇది ఇప్పటివరకు డిఫ్తీరియా, టెటనస్, పెర్టుస్సిస్, హెపటైటిస్ బి, హేమోఫిలస్ ఇన్​ఫ్లూఎంజా టైప్-బి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ఐదు ఇన్ వన్ వ్యాక్సిన్లను రూపొందించింది. ఈ వ్యాక్సిన్లు 100 కి పైగా దేశాలకు సరఫరా అవుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఇది రెండు బిలియన్లకు పైగా వ్యాక్సిన్​ డోసులను సరఫరా చేసింది.
Published by:Shiva Kumar Addula
First published: