ఎక్కడివాళ్లు అక్కడే... చేతులు జోడించి మరీ వేడుకున్న జగన్

మన వాళ్లను మన రాష్ట్రంలోకి రానివ్వని పరిస్థితి బాధాకరమని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పడం లేదని సీఎం జగన్ తెలిపారు.

news18-telugu
Updated: March 26, 2020, 6:43 PM IST
ఎక్కడివాళ్లు అక్కడే... చేతులు జోడించి మరీ వేడుకున్న జగన్
చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం జగన్
  • Share this:
అంతా క్రమశిక్షణతో ఎవరి ఇంటికి వాళ్లు పరిమితమైతేనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మన వాళ్లను మన రాష్ట్రంలోకి రానివ్వని పరిస్థితి బాధాకరమని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పడం లేదని ఆయన తెలిపారు. ఒకవేళ వారిని రాష్ట్రంలోకి తీసుకున్నా... వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాల్సి వస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని... రాష్ట్రంలోని ఏపీ ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తానని చెప్పారని జగన్ తెలిపారు. అందుకే దయ చేసి అంతా ఎక్కడికక్కడే ఉండిపోవాలని అన్నారు. అలా జరగకపోతే... వ్యాధి వచ్చిన వాళ్లు ఎవరితో కాంటాక్ట్ అయ్యారనే విషయం తెలుసుకోవడం కష్టసాధ్యమవుతుందని సీఎం జగన్ తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా మన ఇంట్లోని వృద్ధులే ఎక్కువగా ఇబ్బందిపడే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలోని ఇప్పటివరకు 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని... పరిస్థితిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని జగన్ తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ కారణంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. కరోనా వైరస్ ప్రబలితే తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం 1902 హెల్ప్ లైన్‌ను కూడా ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు.
విదేశాలకు వెళ్లి వచ్చినవాళ్లను 27,819 మందిని గుర్తించామని... వారంతా తమ తమ ఇళ్లల్లో ఉండటం చాలా అత్యవసరమని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. గ్రామవాలంటీర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశావర్కర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. స్వీయ నియంత్రణ చాలా అవసరమని... అందరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. నాలుగుచోట్ల కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని... కోవిడ్‌ -19 ప్రత్యేక ఆస్పత్రుల్లో 450 ఐసీయూ బెడ్స్‌.. ప్రతి జిల్లాలో క్వారంటైన్‌ కోసం 200 ఐసోలేషన్ బెడ్స్‌.. ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 బెడ్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. 80శాతం మంది ఇళ్లల్లో ఉండే కరోనాను ఎదుర్కొన్నారని... కేవలం 14శాతం మాత్రమే ఆస్పత్రులకు వెళ్లిన పరిస్థితి ఉందని సీఎం జగన్ వ్యాఖ్యనించారు. 4 శాతం మంది మాత్రమే ఐసీయూకు వెళ్లారని సీఎం జగన్ తెలిపారు.First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు