Free Treatment: కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫ్రీ ట్రీట్‌మెంట్.. ఖర్చులన్నీ ప్రభుత్వానివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన తర్వాత అక్కడ బెడ్ దొరక్కపోతే.. ఆ రోగులను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తారు. వీరికి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.

  • Share this:
    కరోనా మమహ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. పేషెంట్లతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ దొరకడం లేదు. ప్రైవేట్‌కు వెళ్దామంటే లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. అంత డబ్బు పెట్టి చికిత్స తీసుకోలేక.. ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యం అందక.. సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా వైద్య చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన తర్వాత అక్కడ బెడ్ దొరక్కపోతే.. ఆ రోగులను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తారు. వీరికి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.


    'ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో లేకుంటే ఆ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తాం. అక్కడ రోగులకు అయ్యే వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వం ఆస్పత్రులు పంపించిన రోగులను ప్రైవేట్ ఆస్పత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి పంపకూడదు.' అని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెగాల్ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన కరోనా రోగుల అంత్యక్రియల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

    ఇక యూపీలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కానీ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం లక్నో, ఐఐటీ బీహెచ్‌యూతో కలిసి ఆక్సిజన్ ఆడిట్ చేస్తామని చెప్పారు. ఆక్సిజన్ డిమాండ్, సప్లై, డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి లైవ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని శనివారంతో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం యోగి తెలిపారు.

    కాగా, యూపీలో శనివారం 36,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 22,566 మంది కోలుకోగా.. 196 మంది మరణించారు. తాజా లెక్కలతో ఉత్తరప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,13,370కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 7,28,980 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 10,737 మంది మరణించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 2,73,653 యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: