Home /News /coronavirus-latest-news /

Coronavirus: కరోనావైరస్ జీవాయుధమే.. 2015లోనే చైనా స్కెచ్.. మూడో ప్రపంచ యుద్ధానికి ప్లాన్

Coronavirus: కరోనావైరస్ జీవాయుధమే.. 2015లోనే చైనా స్కెచ్.. మూడో ప్రపంచ యుద్ధానికి ప్లాన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2015లో చైనా రక్షణరంగ శాస్త్రవేత్తల, వైద్య నిపుణుల మధ్య చర్చలకు సంబంధించిన రీసెర్చ్ పేపర్ బయటకు రావడంతో.. ఇప్పుడు మళ్లీ చైనా ప్రమేయంపై ప్రపంచమంతటా అనుమానాలు బలపడుతున్నాయి.

  కరోనా.. చైనీస్ వైరస్. అది ముమ్మాటికీ చైనీస్ వైరస్సే. గత ఏడాది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్క డొనాల్డ్ ట్రంపే కాదు చాలా మంది చైనానే అనుమానించారు. వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌కు చైనాయే కారణమని.. దీనిక వెనక ఏదో కుట్ర ఉందని ట్రంప్‌తో పాటు చాలా మంది ఆరోపించారు. కానీ చైనా మాత్రం ఖండిస్తూ వచ్చింది. ఐతే తాజాగా చైనాకు, కరోనాకు ఉన్న లింకుపై సంచలన విషయాలు బయటకొచ్చాయి. మూడో ప్రపంచ యుద్ధం కోసం చైనా కుట్రచేసిందని.. జీవాయుధంగా కరోనావైరస్‌ను తయారు చేసిందని వీకెండ్ ఆస్ట్రేలియా అనే వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. సార్స్ కరోనా వైరస్ రూపంలో జీవాయుధాన్ని (బయో వెపన్) తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని ఈ కథనం సారాంశం.

  2015లో చైనా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు రాసిన రీసెర్చ్ డాక్యుమెంట్‌ను 'వీకెండ్ ఆస్ట్రేలియా' బయటపెట్టింది. అంటే ఆరేళ్ల క్రితమే జీవాయుధ నిమిత్తం కరోనా వైరస్‌పై చైనా ప్రయోగాలు చేసిందన్న మాట. 'The Unnatural Origin of SARS and New Species of Man-Made Viruses as Genetic Bioweapons' టైటిల్‌తో ఉన్న ఆ రీసెర్చ్ పేపర్స్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. చైనా రక్షణరంగ శాస్త్ర‌వేత్తలు మూడో ప్ర‌పంచం యుద్ధం గురించి ఇందులో ప్రస్తావించారు. సార్స్ వైర‌స్ జాతి నుంచి త‌యారు చేసిన జీవాయుధంతో మూడో ప్రపంచ యుద్ధం జ‌రుగుతుందని చైనా వైద్య నిపుణులతో వారు చ‌ర్చించిన‌ట్లు డాక్యుమెంట్‌లో ఉంది. ఈ జీవాయుధాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. కరోనాను కొత్తరకం ఆయుద్ధంగా అభివర్ణించారు.

  ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలిసీ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ జెన్నింగ్స్ news.com.auతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు చెందిన పలు రకాల స్ట్రెయిన్‌లను జీవాయుధాలుగా వాడేందుకు చైనా సైంటిస్టులు సృష్టించారని ఆరోపించారు. ఖచ్చితంగా చైనానే ఉద్దేశ్యపూర్వకంగా కరోనా వైరస్‌ను తయారుచేసిందని అన్నారు. అందుకే డబ్ల్యూహెచ్‌వోతో పాటు ఇతర దేశాల సంస్ధలు వుహాన్‌కు వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే... చైనా ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఒకవేళ వుహాన్‌లో మార్కెట్ నుంచే వైరస్ వ్యాపిస్తే.. విచారణకు చైనా ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. వుహాన్ సమీపంలోనే వైరాలజీ ల్యాబ్ ఉందని... 2015లోనే జీవాయుధం గురించి చర్చించినట్లు ఈ పేపర్ల ద్వారా బయపడిందని.. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే.. కరోనా వైరస్‌‌ను చైనాయే తయారుచేసిందని స్పష్టమవుతోందని తెలిపారు.

  లీకైన ఈ రీసెర్చ్ పేపర్స్ ఫేక్‌ కాదని.. అది నిజమైనవేనని ఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ధృవీకరించినట్లు news.com.au వెల్లడించింది.

  గతంలో చైనీస్ వైద్య నిపుణులు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసింది. చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్‌-2 వైర‌స్ త‌యారైన‌ట్లు ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా 2015లో చైనా రక్షణరంగ శాస్త్రవేత్తల, వైద్య నిపుణుల మధ్య చర్చలకు సంబంధించిన రీసెర్చ్ పేపర్ బయటకు రావడంతో.. ఇప్పుడు మళ్లీ చైనా ప్రమేయంపై ప్రపంచమంతటా అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ హయాంలో చైనాపై విరుచకుపడిన అమెరికా.. ఇప్పుడు ఏం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Australia, China, Coronavirus, Covid-19

  తదుపరి వార్తలు