Covid Cases In China : ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లో కరోనా వైరస్(Coronavirus) కనుమరుగవుతున్న తరుణంలో కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా(China)లో కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తుంది. ప్రపంచ దేశాల్లో చాలా వరకు నియంత్రణలోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాలో మరోమారు విజృంభిస్తోంది. గత నాలుగైదు రోజులుగా దేశంలో వైరస్ కేసులు దాదాపు 40వేల వరకు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. చైనావ్యాప్తంగా సోమవారం 39,452 కోవిడ్ పాజిటివ్ కేసులు(Covid Positive Cases) నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్(NHS) ప్రకటించింది. ఈ కేసుల్లో 36,304 అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)కేసులు అని తెలిపారు. ఒక్క రాజధాని బీజింగ్ లోనే దాదాపు 4వేల పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. చైనాలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా జనం చేస్తున్న ఆందోళనల వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద సంఖ్యలో జనం గుమికూడడం వల్లే దేశంలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు.
కాగా, చైనాలో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చైనాలో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఇప్పటికే జిన్ పింగ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలతో జీరో కొవిడ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. ఒక్క పాజిటివ్ కేసు బయటపడినా సదరు బిల్డింగ్ ను సీజ్ చేయడం, జనాలను ఇళ్లల్లోనే ఐసోలేట్ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించడం ,తదితర చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆకలితో మాడుతున్నామని, చాలామంది తిండిలేక చనిపోయారని చైనా ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన మాకు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ ఇంటికే పరిమితమైతే బతికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల తీరును తప్పుబడుతూ, జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కరోనా ఆంక్షలు తొలగించాలని బీజింగ్, షాంఘై, షింజియాంగ్ తదితర నగరాల్లో జనం ఆందోళనలు చేస్తున్నారు. చెంగ్డూ, షియాన్, వూహాన్ వంటి నగరాల్లోనూ నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు. శనివారం,ఆదివారం షాంఘైలో నిరసనకారులు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తన ఆందోళన చేపట్టారు. బీజింగ్‌లోని ప్రతిష్టాత్మక సింగువా విశ్వవిద్యాలయం, నాన్జింగ్లోని కమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థుల నిరసనలు చెలరేగాయి.
Atacama Desert : చెత్తకుప్పలా అటకామా ఎడారి.. పర్యావరణ వేత్తల ఆందోళన
గురువారం రాత్రి ఉర్ముచీలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి దాదాపు 10 మంది సజీవదహనం కావడానికి కరోనా ఆంక్షల కారణమని ఆరోపిస్తూ ఈ ఆందోళనకు దిగారు. కఠిన ఆంక్షల వల్ల బయటకు రాలేకపోవడంతో అగ్నికి ఆహుతయ్యారని ఆరోపణలు రావడం.. పౌరుల ఆగ్రహానికి కారణమైంది. పెద్దఎత్తున బారికేడ్లను దాటి.. వీధుల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు చేపట్టిన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ డౌన్.. షీ జిన్‌పింగ్ పదవిలో నుంచి దిగిపోతేనే ఉర్ముచీకి స్వేచ్ఛ అని చైనా అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలను తాను ఎన్నడూ చూడలేదు అని పలువురు తెలిపారు. చైనా అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీ కారణంగా యువత, కార్మికులు, మధ్యతరగతి, సంపన్నులు సహనం కోల్పోయారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ హో ఫుంగ్ అన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా చైనా పాలకులు మాత్రం తమ జీరో కోవిడ్ విధానాన్ని సమర్దించుకుంటున్నారు. ప్రాణాలు కాపాడుకుని, ఆరోగ్య వ్యవస్థలపై పెను భారం పడకుండా ఉండాలంటే ఇదే ఉత్తమైన మార్గమని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Coron cases, Covid 19 restrictions, Covid rules, Covid-19