Corona : పెద్ద వయసు వారితో పోలిస్తే పిల్లలపై వైరస్ తీవ్రత, లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అయితే రెండో దశ కరోనా యువతకు ఎక్కువ ప్రమాదకరంగా మారుంతోందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తోంది. మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే రూపాన్ని మార్చుకున్న కరోనా, ఇప్పుడు ఎక్కువ మందిని బలి తీసుకుంటోంది. మొదటి దశలో మహిళలు, చిన్నపిల్లలపై వైరస్ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా పిల్లలు, యువత ఉండటం ఆందోళనకరమైన అంశం. ఈసారి యుక్తవయసు వారిపై కూడా వైరస్ తీవ్రమైన ప్రభావం చూపుతోందని కేసులను పోల్చి చూస్తే తెలుస్తోంది. పెద్ద వయసు వారితో పోలిస్తే పిల్లలపై వైరస్ తీవ్రత, లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అయితే రెండో దశ కరోనా యువతకు ఎక్కువ ప్రమాదకరంగా మారుంతోందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.ఈసారి ఎక్కువ మంది పిల్లలకు వైరస్ సోకుతోంది. చాలామందిలో తీవ్రమైన వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. పిల్లల్లో వైవిధ్యమైన వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈసారి దగ్గు, జలుబు, జ్వరం కాకుండా డయేరియా, కడుపు నొప్పి వంటి లక్షణాలతో వైరస్ వ్యాపిస్తోందని నిర్ధారిస్తున్నారు. ఇలాంటి కేసులను వివిధ రాష్ట్రాల్లో గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో పదేళ్ల లోపు పిల్లల్లో చిన్నపాటి కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో సాధారణ జ్వరం, ఇతర లక్షణాలు బయట పడుతున్నాయి. ఇవి రెండు, మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి.
* ఎక్కువగా కనిపించే లక్షణాలు
రెండో దశలో కరోనా సోకిన చిన్నారులకు 102 డిగ్రీల కంటే ఎక్కువ తీవ్రతతో జ్వరం వస్తోంది. సాధారణం కంటే వేగంగా శ్వాస తీసుకోవడం, రోజుకు ఆరు కంటే తక్కువసార్లు మూత్రం పోయడం, ఆకలి లేకపోవడం, శరీరంపై దద్దుర్లు, ఇప్పటికే దగ్గు ఉన్నవారికి కొత్త రకం దగ్గు రావడం, చిరాకు, తలనొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయితే పిల్లలకు కూడా కరోనా టెస్టులు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది పిల్లలకు లక్షణాలు లేకపోవచ్చు. అంతమాత్రాన వ్యాధి లక్షణాలు కనిపించేంత వరకు వేచి చూడకూడదు. దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులు ఉన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అస్వస్థత ఎదురైనా కరోనా పరీక్షలు చేయించాలి. సాధ్యమైనంత త్వరగా వారికి చికిత్స అందించాలి.
* కేసుల్లో పెరుగుదల ఎందుకు?
రెండో దశలో కరోనా పిల్లలు, యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఇప్పటి వరకు నిరూపితం కాలేదు. మొత్తం కేసులతో పాటు యువతలోనూ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంక్షలు విధించడానికి ముందు దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం, పరీక్షలు, ఆటపాటలు వంటి కార్యకలాపాలు పెరగడం వల్ల కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పవచ్చు.
పిల్లలకు పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబాల్లో కనీసం ఒకరికి వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అంటే సన్నిహితుల ద్వారా మాత్రమే యువత, చిన్నారులు కోవిడ్ బారిన పడుతున్నారని భావించాలి. సాధారణంగా వైరస్ సోకిన చిన్నారులకు 36 గంటల్లో లక్షణాలు తగ్గుతాయి. వారిలో తేలికపాటి జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ వీలైనంత త్వరగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తే పెద్దగా ప్రమాదం లేకుండా బయటపడే అవకాశం ఉంది.