బ్రిటన్‌లో వెలుగు చూస్తున్న కొత్త రకం కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రపంచమంతా మరోసారి వణికిపోతోంది. ఈ వైరస్ ఎక్కడ తమ దేశాలకు వ్యాపిస్తుందో అనే టెన్షన్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో నెలకొంది. అయితే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను చాలా దేశాలు రద్దు చేశాయి. అక్కడి నుంచి వచ్చిన వారిని ఆరోగ్య పరిస్థితిని క్షణ్ణంగా పరీక్షిస్తున్నాయి. భారత్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన కేంద్రం.. తాజాగా సరికొత్త మార్గదర్శకాలను వెలువరించింది. కొత్త రకంగా కరోనా వైరస్ వేగంగా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
అందుకే గత నాలుగు వారాల్లో బ్రిటన్ నుంచి లేదా ఆ దేశం మీదుగా వచ్చిన ప్రయాణికులు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికులందరూ వారి గత 14 రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. ఆ వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ, పాజిటివ్ అని తేలితే..స్పైక్ జీన్‌కు సంబంధించిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు సిఫార్సు చేస్తారు. ఇక వారిలో ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలితే..లక్షణాల తీవ్రతను బట్టి హోం ఐసోలేషన్‌లో ఉంచడం కానీ, ఆసుపత్రులకు తరలించడం కానీ చేస్తారు.
ఒకవేళ ప్రయాణికుడికి కొత్త రకం వైరస్ పాజిటివ్‌గా తేలితే..బాధితుడికి ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్లో చికిత్స అందిస్తారు. అలాగే కొత్త రకం కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తితో ప్రయాణించిన వారిని కూడా క్వారంటైన్లో ఉంచాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇక చెక్ఇన్ సమయంలోనే ప్రయాణికులకు ఎస్ఓపీల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. అలాగే యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సంబంధిత రాష్ట్రాలు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రొగ్రామ్‌కు అందించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సైతం కేంద్రం సూచనలు జారీ చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:December 22, 2020, 22:49 IST