Covid Vaccine : జంతువులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు జూపార్క్ ల్లో సింహాలు, పులులు వరుసగా కరోనా బారిన పడుతున్నాయి. గతేడాది హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో కూడా ఏకంగా 8 సింహాలు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలోని ఓ నేషనల్ పార్క్ లో రెండు సింహాలు కరోనావైరస్ సోకి మరణించాయి. ఇలా మూగజీవాలకు సైతం ఈ మహమ్మారి సోకుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంతువులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine)ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు హర్యాణాలోని ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRCE)సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గతేడాది జూన్‌లో చెన్నైలోని వండలూర్ జూలోని 15 సింహాలు కరోనా బారినపడిన తర్వాత జంతువులకు కూడా వ్యాక్సిన్ తయారుచేయాలని ఐసీఏఆర్- ఎన్ఆర్ సీఈకి పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC)గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ CoWin Portal: కోవిన్ రిజిస్ట్రేషన్‌లో మార్పులు.. ఇకపై మరింత వెసులుబాటు
త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జూలలో ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRCE)అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌తో క్లినికల్ ట్రయల్స్ చేపట్టబోతున్నారు. ఒక జాతికి చెందిన జంతువులు 15కు మించి ఉన్న జూ పార్కు ల్లోనే ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. బెంగళూరు, భోపాల్, నాగపూర్, జునాగఢ్, జైపూర్ లలో ఉన్న ఆరు జూ పార్క్ లలో ఈ టీకా ట్రయల్స్ జరగనున్నాయి. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేవలం సింహాలు, చిరుత పులులకు మాత్రమే టీకాలు ఇవ్వనున్నారు.
రెండు డోసుల మధ్య వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించారు. జంతువులకు రెండవ డోస్ ఇచ్చిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు వాటిని ప్రత్యేక అబ్జర్వేషన్ లో ఉంచి యాంటీ బాడీస్ ని పర్యవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రాగానే క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నట్లు జునాగఢ్ లోని సక్కర్ బాగ్ జూ డైరెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. జునాగడ్‌లోని సక్కర్‌బాగ్ జూలో 70కిపైగా సింహాలు, 50 చిరుతపులులు ఉన్నాయి. కాగా, ప్రపంచంలో తొలిసారిగా 2020 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని బ్రోనెక్స్ జూలో జంతువులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థరణ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.