నెల్లూరులో దారుణం.. కరోనాతో మృతిచెందిన వారి పట్ల అమానుషం..

ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పారిశుద్ధ్య సిబ్బంది వ్యాన్ నుంచి కిందకు దించి వాటిని జేసీబీలోకి విసిరేశారు. తర్వాత జేసీబీ సాయంతో గోతిలోకి విసిరేశారు.

 • Share this:
  ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా కనీసం తోబుట్టువులను సైతం పట్టుకోలేని పరిస్థితులు దాపురించాయి. కరోనా అనుమానిత లక్షణాలు కన్పిస్తే చాలు.. వారిని పగవారి కంటే ఎక్కువ హీనంగా చూస్తున్నారు. ఇందుకు వైరస్ వ్యాప్తిపై ఉన్న అపోహలే ప్రధాన కారణం. అయితే ఇది అవగాహన లేని వారైతే ఏమో అనుకోవచ్చు. కానీ అన్నీ తెలిసిన వారు సైతం అదేలా ప్రవర్తిస్తున్నారు. ఇదిలావుంటే.. కరోనా వైరస్‌తో మరణించిన వారిపట్ల ప్రభుత్వ సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కనీస మానవత్వం మరిచి ఆ మృతదేహాలను చాలా దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. చనిపోయిన వారిని దేవుడిలా భావించే భారతీయ సంస్కృతిలో ఇలాంటి ఘటనల పట్ల స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోంది. గతంలో ఏపీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించింది.

  కరోనాతో చనిపోయిన మృతదేహాలను గౌరవ మర్యాదలతోనే అంత్యక్రియలు చేయాలని సూచించింది. అయినా మున్సిపల్ సిబ్బందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనాతో చనిపోయిన మృతదేహాల పట్ల పారిశుద్ధ్య సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లాలోని పెన్నా నది తీరంలో మృతదేహాలను అత్యంత దారుణంగా ఖననం చేశారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పారిశుద్ధ్య సిబ్బంది వ్యాన్ నుంచి కిందకు దించి వాటిని జేసీబీలోకి విసిరేశారు. తర్వాత జేసీబీ సాయంతో గోతిలోకి విసిరేశారు.

  ఈ సీన్ మొత్తాన్ని రోడ్డుపై వెళుతున్నవారు వీడియో తీశారు. ఆ వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. అవి కాస్త వైరల్ అవ్వడంతో ఈ అమానుషం బయటపడింది. అయితే పెన్నా నది ఒడ్డున ఖననం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
  Published by:Narsimha Badhini
  First published: