ముంచుకొస్తున్న మరో మహమ్మారి, చైనాలో కొత్త వ్యాధి

Brucellosis Outbreak in China: ఇంత‌కు ముందు చైనాలోని వూహాన్లో పుట్టిన క‌రోనా వైర‌స్ అన్ని దేశాల‌కూ పాకింది. ఇప్పుడు వాయువ్య చైనాలో వేల మంది ఒక కొత్త ర‌కం వ్యాధి బారిన ప‌డుతున్నారు.

news18-telugu
Updated: September 25, 2020, 6:51 PM IST
ముంచుకొస్తున్న మరో మహమ్మారి, చైనాలో కొత్త వ్యాధి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌పంచం, మ‌రో మ‌హ‌మ్మారి బారిన ప‌డేలా ఉంది. క‌రోనా వైర‌స్‌కు మూల బిందువుగా ఉన్న చైనా.. మ‌రో కొత్త వ్యాధి వ్యాప్తికి కూడా కార‌ణం అవుతోంది. ఇంత‌కు ముందు చైనాలోని వూహాన్లో పుట్టిన క‌రోనా వైర‌స్ అన్ని దేశాల‌కూ పాకింది. ఇప్పుడు వాయువ్య చైనాలో వేల మంది ఒక కొత్త ర‌కం వ్యాధి బారిన ప‌డుతున్నారు. బ్రుసెల్లా బ్యాక్టీరియా కార‌ణంగా వాయువ్య చైనాలో చాలామంది బ్రు‌సెల్లోసిస్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. గాన్సు ప్రావిన్స్ రాజ‌ధాని లాంజౌ న‌గ‌రం ఈ వ్యాధి వ్యాప్తికి మూలంగా ఉంది. ఇప్ప‌టికే 3,245 మంది ఈ వ్యాధి బారిన ప‌డిన‌ట్టు‌ నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ఆఫ్ లాంజౌ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. మ‌రో 1401మందికి ప్రాథ‌మికంగా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలుస్తోంది. దీని బారిన ప‌డిన‌వారు ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించ‌లేదు. ఈ బ్యాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ భార‌త్‌నూ తాకింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

కరోనా వంటిదేనా?

నావ‌ల్ కరోనా వైరస్‌ కంటే ఈ బ్యాక్టీరియా సున్నిత‌మైంద‌ని, క‌రోనా కంటే వేగంగా ఇది వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. జీన‌స్ బ్రుసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా బ్రుసెల్లోసిస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది మ‌నుషులతో పాటు జంతువుల్లో కూడా వ్యాపించే అవ‌కాశం ఉంది. బ్రుసెల్లా బ్యాక్టీరియా సోకిన జంతువుల‌ను తాక‌డం, స‌రిగ్గా వండ‌ని మాంసాహారం, శుద్ధి చేయ‌ని పాలు, పాల ఉత్ప‌త్తులు తీసుకోవ‌డం, క‌లుషిత‌మైన గాలి పీల్చ‌డం ద్వారా ఈ వ్యాధి మ‌నుషుల‌కు సోకే అవ‌కాశం ఉంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మ‌రొక‌రికి సోక‌డం చాలా అరుదు అని సీడీసీ చెబుతోంది. బ్యాక్టీరియా గాలి ద్వారా మ‌నిషి శ‌రీరంలోకి వెళ్లిన‌ప్పుడు, పాడైపోయిన ఆహారం తీసుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఇది మ‌నుషుల‌కు వ్యాపిస్తుంది. లాంజౌ న‌గ‌రంలో ఇలానే బ్రుసెల్లోసిస్ వ్యాపించి ఉండొచ్చ‌ని నిపుణులు భావిస్తున్నారు. సెక్సువ‌ల్ కాంటాక్ట్, బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా బ్యాక్టీరియా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకే అవ‌కాశం ఉంది. శ‌రీరంపై చిన్న‌పాటి గాయాలు ఉన్న‌వారు బ్యాక్టీరియా బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌.

ఫార్మా కంపెనీ నుంచి లీకైన బ్యాక్టీరియా

జాంగ్మూ లాంజౌ బ‌యోఫార్మా కంపెనీ నుంచి ఈ బ్యాక్టీరియా ప్ర‌మాద‌వ‌శాత్తూ లీక్ అయింద‌ని సీఎన్ఎన్ వార్తా సంస్థ చెబుతోంది. గ‌త జులై- ఆగ‌స్టు నెల‌ల్లో ప‌శువుల‌కు బ్రుసెల్లా సోక‌కుండా నిరోధించే టీకాను త‌యారుచేస్తున్న క్ర‌మంలో ఈ ఫార్మా కంపెనీ నుంచి బ్యాక్టీరియా విడుద‌లై గాలిలో క‌లిసింద‌ని ఆ సంస్థ పేర్కొంది.  అదే ఇప్పుడు వ్యాధి వ్యాప్తికి కార‌ణ‌మ‌ని తెలిపింది. లీకైన బ్యాక్టీరియాను నశింప‌జేయ‌డానికి గ‌డువు తీరిన డిస్ ఇన్ఫెక్టెడ్ ల్విక్విడ్లు, శానిటైజ‌ర్ల‌ను అక్క‌డి శాస్త్రవేత్తలు వాడ‌టంతో బ్యాక్టీరియా పూర్తిగా నాశ‌నం కాకుండా గాలిలో క‌లిసింద‌ని సీఎన్ఎన్ విశ్లేషిస్తోంది.

ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి?

బ్రుసెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌టానికి కొన్ని వారాల నుంచి నెల‌ల స‌మ‌యం ప‌ట్టొచ్చు. జ్వ‌రం, కీళ్ల నొప్పులు, న‌ల‌త‌గా అనిపించ‌డం, త‌ల‌నొప్పి, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం వంటివి వ్యాధిగ్ర‌స్తుల్లో క‌నిపించే సాధార‌ణ ల‌క్ష‌ణాలు. సాధార‌ణ ఫ్లూ, కోవిడ్‌-19 ల‌క్ష‌ణాలే బ్రుసెల్లోసిస్ సోకిన‌వారిలోనూ క‌నిపిస్తాయి. కానీ దీని బారిన ప‌డిన‌వారి శ‌రీర భాగాల్లో వాపు క‌నిపిస్తుంది. కీళ్ల వాపులు, వెన్నెముక, వృష‌ణాల్లో వాపు వంటివి వీరిని దీర్ఘ‌కాలం వేధిస్తాయి. బ్రుసెల్లోసిస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కానీ ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల యాంటీ బ్యాక్టీరియ‌ల్ మందుల‌తోనే దీనికి చికిత్స అందిస్తున్నారు. కానీ యాంటీబ‌యోటిక్స్‌తో చికిత్స కొన్ని వారాల నుంచి కొన్ని నెల‌ల పాటు చేస్తేనే ప్ర‌తిఫ‌లం క‌నిపిస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ న‌య‌మైనా మ‌ళ్లీ తిర‌గ‌బెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌. అనారోగ్యంతో బాధ‌ప‌డే ప‌శువుల‌కు దూరంగా ఉండ‌టం‌, శుద్ధి చేయ‌ని పాలు, పాల ఉత్పత్తు‌లకు దూరంగా ఉండ‌టం ద్వారా దీని బారిన ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

భార‌త్‌కు ప్ర‌మాదం ఉందా?

భార‌త్‌లో ఎక్కువ‌మంది వ్య‌వ‌సాయం, పాడి ప‌రిశ్ర‌మ‌మీదే ఆధార‌ప‌డుతున్నారు. ప‌శువుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్న వారు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఆవులు, గేదెలు, పందుల ఫామ్ల‌లో ప‌నిచేసేవారికి ఈ వ్యాధి సోకే అవ‌కాశాలు ఎక్కువ‌. భార‌త్‌లో ఇప్ప‌టికే ఈ వ్యాధి వ్యాప్తిలో ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. సంవ‌త్స‌రానికి క‌నీసం ల‌క్ష‌మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నార‌ని, వీరిలో క‌నీసం రెండు శాతం మంది చ‌నిపోతున్నార‌ని ఒక ప‌రిశోధ‌నాప‌త్రం వెల్ల‌డించింది. చైనాలో బ్రుసెల్లోసిస్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌న దేశంలోనూ దీనికి సంబంధించిన టెస్టులు చేయాల‌ని వారు సూచిస్తున్నారు. కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా మ‌రో మ‌హ‌మ్మారిగా మార‌క‌ముందే దీన్ని అంతం చేయొచ్చ‌ని వారు పేర్కొన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 25, 2020, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading