news18
Updated: November 10, 2020, 1:36 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 10, 2020, 1:36 PM IST
అంతర్జాతీయంగా కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న చైనాకు ఊహించని షాక్ తగిలింది. చివరిదశలో ఉన్న ఆ దేశానికి చెందిన ‘కరోనావాక్’ ప్రయోగాలను నిలిపేస్తున్నట్టు బ్రెజిల్ తెలిపింది. ఈ మేరకు ప్రయోగాలకు అడ్డుకట్ట వేసింది. బ్రెజిల్ లో ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో పలువురిలో మరణాలు సంభవించగా.. మరికొందరిలో దుష్ప్రభావాలు దారితీసేవిధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రెజిల్ ప్రయోగాలకు అడ్డుకట్ట వేసింది. గత నెలలో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతోనే బ్రెజిల్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
వివరాల్లోకెళ్తే... గతనెల 29న కరోనా వ్యాక్సిన్ వేసుకున్న పలువురు వాలంటీర్లలో అస్వస్థత కలిగింది. మరణాలు కూడా సంభవించాయని చెబుతున్నా.. అందుకు సంబంధించిన సమాచారమేమీ అందుబాటులో లేదు. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో దుష్ప్రభావాలు వస్తున్నాయని.. అవి దీర్ఘకాలంలో వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరించడంతో ఈ ప్రయోగాలకు బ్రెజిల్ బ్రేక్ వేసింది. కాగా ఇలా జరగడం ఇదే తొలిసారి.
చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారుచేస్తున్న ఈ ప్రయోగాల్లో దుష్పరిణామాలు సంభవించడం ఇదే తొలిసారి. టీకా చివరి దశ ప్రయోగాలు బ్రెజిల్ లో 60 వేల మందిపై జరుగుతున్నాయి. అంతేగాక చైనాలో ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను చాలామందికి ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా బ్రెజిల్ లో దుష్పరిణామాల నేపథ్యంలో వీళ్లందరి పరిస్థితి ఏమిటా..? అని చైనాలో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో బ్రెజిల్ లో ఈ ప్రయోగాలు చేపడుతున్న సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ నుంచి కూడా స్పందిస్తూ.. ప్రయోగాలను నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటివి జరగడం సాధారణమేనని తెలిపింది. విదేశాల్లో ఆస్ట్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి సంస్థల ప్రయోగాలు మొదట్లో ఆగినా.. తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయని గుర్తు చేసింది. కాగా హడావిడి ప్రయత్నాల కారణంగానే ఈ విధంగా జరుగుతుందని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఏళ్లకేళ్లు పట్టే వ్యాక్సిన్ ప్రక్రియలు.. వేగవంతం చేసేందుకు నియమాలను సడలించడం, కాల వ్యవధిని కుదించడం కారణంగానే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని వారు హెచ్చరించారు.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 1:36 PM IST