Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం... బాధితుడి కుటంబసభ్యుల్లో ఆందోళన

ప్రతీకాత్మక చిత్రం

AP Black Fungus Case: పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. నిడదవోలులోని ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు.

  • Share this:
    కరోనా నుంచి కోలుకున్న కొందరిని బ్లాక్ ఫంగస్ వ్యాధి కబళిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త రకంగా వ్యాధి కారణంగా మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ వ్యాధి ఇంకా తీవ్రరూపం దాల్చలేదు. అలాంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.అయితే ఏపీలోని పలు జిల్లాల్లో ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా మరణాలు నమోదవుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ కేసులను ఇంకా ధృవీకరించలేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

    నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లికి బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయిన సమయానికే ఆయన కన్ను వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది. దీంతో రాజమండ్రి, వైజాగ్ వైద్యులను ఆయన కుటుంబీకులు సంప్రదించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు వీటిని ధృవీకరించారు. కన్ను, ముక్కు, మెదడుకు ఈ బ్లాక్ ఫంగస్ వ్యాపించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంగా కన్నును వెంటనే తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అంజిబాబు కుటుంబీకులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

    మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా..? అని అధికారులు ఆరా తీస్తున్నారన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ నివారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1600 వాయల్స్‌ను వాటాగా కేటాయించగా, వాటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: