ఏపీలో మాజీ మంత్రిని బలితీసుకున్న కరోనా... మాణిక్యాలరావు కన్నుమూత..

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వైరస్‌తో కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు.

news18-telugu
Updated: August 1, 2020, 5:20 PM IST
ఏపీలో మాజీ మంత్రిని బలితీసుకున్న కరోనా... మాణిక్యాలరావు కన్నుమూత..
మాణిక్యాలరావు (ఫైల్ ఫొటో)
  • Share this:
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వైరస్‌తో కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు ఆయన మంత్రిగా కొనసాగారు. మాణిక్యాలరావుకు కరోనా రావడంతో నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు.

మాణిక్యాలరావు పూర్తిపేరు పైడికొండల మాణిక్యాలరావు. ఫొటో గ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా మంత్రి స్థాయికి ఎదిగారు.  తనకు కరోనా వచ్చిన విషయాన్ని జూలై 4న ఆయనే స్వయంగా తెలియజేశారు. ఓ వీడియో ద్వారా ఆయన ఈ వివరాలు తెలిపారు. మిత్రుడికి కరోనా రావడంతో తన ఆఫీసులో పనిచేసే అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో మాణిక్యాలరావుకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా వస్తే ఏదో జరుగుతుందని అందరూ భయపడుతున్నారని, అయితే, అలా అధైర్య పడ వద్దని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరిస్తూ జాగ్రత్తలు పాటిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కానీ, ఆయన్నే కరోనా కబళించింది.

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వతహాగా స్వయంసేవక్ గా ఆర్ఎస్ఎస్‌లో చురుకుగా పనిచేస్తూ 1989లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులుగా పార్టీ కి పలు సేవలు అందించారని గుర్తు చేశారు. మాణిక్యాలరావు మృతి పార్టీ కి తీరని నష్టమని, వారి మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.

మాణిక్యాలరావు మరణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కోలుకుంటారని ఆశించానని, అయితే ఆయన మరణం బాధించిందన్నారు. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఒక నేతను కోల్పోయామన్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2020, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading