మెడికల్ షాపు ముందు రోగి మృతి.. 6 గంటల పాటు శవాన్ని తీయకుండా..

మెడికల్ షాపు ముందు రోగి మృతి.. 6 గంటల పాటు శవాన్ని తీయకుండా..

ప్రతీకాత్మక చిత్రం

చివరకు భాగల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ జోక్యం చేసుకోవడంతో మున్సిపల్ సిబ్బంది కదిలారు. అతడు చనిపోయిన 6 గంటల తర్వాత పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లారు.

 • Share this:
  ఈ కరోనా కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోయింది. సాటి మనుషులకు సాయం చేయడం కాదు కదా.. చచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు. చివరకు శవాన్ని కూడా కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మందులు కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి మెడికల్ షాపు ముందే కుప్పకూలాడు. కరోనా భయంతో ఆ శవాన్ని తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మెడికల్ షాపు యజమానికి ఎంత మందికి ఫోన్ చేసినా నో రెస్పాన్స్..! చివరకు 6 గంటల తర్వాత మున్సిపల్ సిబ్బంది వచ్చి బాడీని తీసుకెళ్లారు. అప్పటి వరకు మెడికల్ షాపు మెట్లపైనే మృతదేహం ఉండిపోయింది.

  భాగల్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్తమాతో బాధపడుతున్నాడు. బుధవారం ఆస్తమా పంప్ కొనేందుకు ఓ మెడికల్ షాపుకు వెళ్లాడు. మందులు, ఆస్తమా పంప్ తీసుకున్న తర్వాత మెడికల్ షాపు ముందే కుప్పకూలిపోయి మరణించాడు. ఐతే ఆ మృతదేహాన్ని తొలగించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాము సమాచారం అందించగా అంబులెన్సు వచ్చినా కొవిడ్ భయంతో మృతదేహాన్ని తీసుకువెళ్లకుండానే తిరిగి వెళ్లిపోయింది. మొదట పోలీసులకు సమాచారం ఇచ్చానని.. వారు వచ్చి వెళ్లిపోయారని మెడికల్ షాపు యజమాని మహమ్మద్ ముస్తాఖ్ ఖాన్ తెలిపారు. ఆ తర్వాత ఎస్పీ, డీఎంతో పాటు చివరకు కోవిడ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసినా.. ఎవరూ రాలేదని వెల్లడించారు.

  చివరకు భాగల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ జోక్యం చేసుకోవడంతో మున్సిపల్ సిబ్బంది కదిలారు. అతడు చనిపోయిన 6 గంటల తర్వాత పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లారు. కాగా, ఘటన జరిగిన భాగల్‌పూర్‌లో వెయ్యికి పైగా కరోనా కేసులున్నాయి. అటు బీహార్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20,173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 13,533 మంది కోలుకోగా.. 174 మంది మరణించారు. ప్రస్తుతం బీహార్‌లో 6,466 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు