BIG SHOCK TO MAOISTS NO MORE KEY LEADER JAGAN HE EFFECTED CORONA VIRUS ONE WOMEN MAOIST ALSO DIED NGS
Corona Effect: పోలీస్ తుటాల నుంచి తప్పించుకున్నారు.. కరోనా కాటు బలి తీసుకుంది.. ముగిసిన 30 ఏళ్ల ప్రస్థానం
మావో కీలక నేత మరణం
తూటాల నుంచి తప్పించుకున్నారు.. ఎన్నో ఎన్ కౌంటర్లను ఎదుర్కొని.. పోలీసులకు ఛాలెంజ్ విసిరారు.. కానీ కరోనా కాటు నుంచి తప్పించుకోలేకపోయారు. దీంతో 30 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికింది. ఇది తమకు కోలుకోలేని దెబ్బ అంటున్నారు మావోయిస్టులు.
మావోయిస్టులకు ఊహించని దెబ్బ తగిలింది. పోలీసుల ఎన్ కౌంటర్లు ఎన్నింటినో తప్పించుకుని.. ఖాకీలకు సవాల్ గా మారిన కీలక నేతను కరోనా కారణంగా కోల్పోవలసి వచ్చింది. గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు 50 ఏళల్ యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్ మరణం వారికి కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. జగన్ సోమవారం మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో మూడు రోజుల సందిగ్థతకు తెరపడింది. మరో కీలక నాయకురాలు ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దిబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో మంగళవారం చనిపోయినట్లు పార్టీ పేర్కొంది. ఒకే సమయంలో తమకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు నేతలు మరణం జీర్ణించుకోలేని విషయమే. ఇది తమ ఉద్యమం ప్రభావం చూపుతుందని మావోయిస్టులు భావిస్తున్నారు. పోలీసులు సైతం కరోనా కారణంగా వారి ఏరి వేతకు మార్గం సులభం చేసింది అంటున్నారు. ఇటీవల విశాఖ జిల్లా ఏజెన్సీలో 6 మందిని మట్టు బెట్టామని.. త్వరలో మరికొంతమంది చిక్కే అవకాశం ఉందనంటున్నారు. ఇప్పటికైనా జరిగిన నష్టానికి గుర్తించి మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నారు.
కారణం ఏదైనా జగన్ లేకపోవడం మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం ఆదివాసీ దంపతులైన యాప కొమ్మక్క, రంగయ్యల మొదటి సంతానం హరిభూషణ్. రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ 1991లో అటవీ దళంలో చేరారు. 1996లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యునిగా కొనసాగారు.
1998లో ఉత్తర తెలంగాణ మొదటి ప్లాటూన్ బాధ్యతలు తీసుకున్నారు. 2000లో ప్రొటెక్షన్ ప్లాటూన్‌కు బదిలీ అయి 2005లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పదోన్నతి పొందారు. 2015 ప్లీనంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2018 నవంబరులో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. హరిభూషణ్ సేవలు పార్టీకి ముఖ్యమని భావించిన కేంద్ర కమిటీ ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేసింది. అక్కడ ఉద్యమకారులందరికీ యుద్ధ పోరాటాలు నేర్పించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వాలు ఆపరేషన్ ప్రహార్, సమాధాన్, ఆపరేషన్ గ్రీన్‌హంట్ కార్యాచరణతో ముందుకు సాగిన క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ దండకారణ్యంలో ఆయన పట్టు సాధించారు. సరిహద్దు ఆదివాసీలు అతడిని లక్మాదాదాగా పిలుస్తారు.
జగన్ ఎన్ కౌంటర్ లో మరణించారని పలుమార్లు ప్రచారం జరిగింది. కానీ ప్రతి ఎన్ కౌంటర్ నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చారు. 2013లో జరిగిన పువర్తి ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారని తొలుత ప్రచారం జరిగింది. 9 మంది మావోయిస్టులు మరణించిన ఈ ఘటనలో హరిభూషణ్ త్రుటిలో తప్పించుకున్నారు. పూజారికాకేడు తడపల గుట్టలపై జరిగిన ఎన్కౌంటర్లోనూ ఆయన పోలీసులకు చిక్కలేదు. 2016 బొట్టెంతోగు ఎదురుకాల్పుల నుంచీ బయటపడ్డారు. చివరకు అనారోగ్యం ఆయన ప్రాణాలను కాటేసింది. హరిభూషణ్ తలపై 40 లక్షల రివార్డు ఉంది. ఆయన సుమారు 30కి పైగా ఎదురుకాల్పుల సంఘటనల నుంచి బయటపడ్డట్లు పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. గంగారానికి చెందిన జెజ్జరి సమ్మక్కను ఆయన ఉద్యమంలోనే వివాహం చేసుకున్నారు. ఈమె సైతం అస్వస్థతతో ఉన్నట్లు తెలుస్తోంది.
మరో మహిళా నేత మరణం కూడా మావోలకు ఎదురుదెబ్బే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఆదివాసీ కుటుంబంలో భారతక్క జన్మించారు. 1985లో ఏటూరునాగారంలోని దళంలో చేరారు. 1986లో అరెస్టయి రెండేళ్లు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చి మళ్లీ దళంలోనే చేరారు. 1989లో తన సహచరుడు కోటి హన్మన్న మృతిచెందారు. అదే సమయంలో కుమారుడు అభిలాష్ జన్మించారు. 2002లో అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన భారతక్క రెండోసారి అరెస్టయ్యారు. 2005లో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి దళంలోకి వెళ్లారు. 2008లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. కుమారుడిని హన్మన్న చెల్లెలి వద్ద పరకాలలో ఉంచి పెంచారు. అతనూ దళంలో చేరి 2020లో గడ్చిరోలీలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
కరోనాతో కన్నుమూసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి. యాక్షన్ టీంలకూ ఇన్ఛార్జిగా ఉన్నారని సమాచారం. రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికితోడు ఉత్తర తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టు ఉండటంతో పార్టీ నాయకత్వం అతడి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు నిఘా వర్గాల అంచనా.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.