Oxygen Plants: ఢిల్లీకి ఊరట.. కొత్తగా 8 ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటు.. ఆ నిధులతో..

ఆక్సిజన్ ట్యాంకర్లు (image credit - twitter)

ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశ రాజధానిలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేక కరోనా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Share this:
దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్​ కొరత తీవ్రంగా వేదిస్తోంది. సరైన సమయంలో ఆక్సిజన్​ లభించక ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు చనిపోతున్నారు. దీంతో మెడికల్​ ఆక్సిజన్​ కొరతను అధిగమించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 551 పీఎస్​ఏ ఆక్సిజన్​ జనరేషన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు పీఎం కేర్స్ ఫండ్స్​ను వినియోగించనుంది. ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశ రాజధానిలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేక కరోనా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ముందు ఢిల్లీలో ఎనిమిది ప్రెజర్ స్వింగ్ ఎడ్జాప్షన్​ (పిఎస్‌ఎ) ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ ఎనిమిది ప్లాంట్ల ద్వారా 14.4 మెట్రిక్ టన్నుల మెడికల్​ ఆక్సిజన్​ను ఉత్పత్తి చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇంతకు ముందు మార్చి 17న కౌశిక్ ఎన్‌క్లేవ్‌లోని బురారి ఆసుపత్రిలో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆక్సిజన్​ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దీంతో పాటు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రి, లోక్ నాయక్ హాస్పిటల్, బాబా సాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్, రోహిణి దీపా చంద్ బంధు ఆసుపత్రుల్లో ఏప్రిల్ 30 నాటికి ప్లాంట్​లను ఏర్పాటు చేయనున్నారు. 2020 నవంబర్​లోనే ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సైట్లను కేటాయించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే దీనిపై ఢిల్లీ ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా తాత్సారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

* పీఎం కేర్​ ఫండ్​తో ప్లాంట్ల ఏర్పాటు..
దక్షిణాపురి అంబేడ్కర్ నగర్ హాస్పిటల్​లో ఆక్సిజన్​ ప్లాంట్​ నెలకొల్పేందుకు నవంబర్​లోనే సైట్​ కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్లు చెబుతోంది. కానీ ఏప్రిల్ 19 వరకు దీనిపై కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకోలేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. నరేలాలోని సత్యవాడి రాజా హరిశ్చంద్ర ఆసుపత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​ నెలకొల్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇంకా సైట్ రెడీనెస్ సర్టిఫికేట్ కూడా సమర్పించలేదని తెలిపారు.

మరోవైపు దేశ రాజధానిలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోందని, దీనిపై కేంద్రం కలగజేసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. అనేక ఆసుపత్రులు ఆక్సిజన్ అవసరాల కోసం SOSలను సైతం పంపించాయి. అయితే ఆక్సిజన్​ ప్లాంట్లను నెలకొల్సాలన్న కేంద్రం ఆదేశాలను పక్కనపెట్టిన కేజ్రీవాల్​.. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని కొంతమంది బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ఆదేశాలను పాటిస్తే ఢిల్లీలో ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ నూతన ప్లాంట్ల ఏర్పాటుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరం ఆక్సిజన్​ అందుబాటులో ఉండనుంది.
First published: