హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Us Elections 2020: అలా అయితే నేను రాను.. ట్రంప్ తో డిబేట్ పై బిడెన్ సంచలన వ్యాఖ్యలు

Us Elections 2020: అలా అయితే నేను రాను.. ట్రంప్ తో డిబేట్ పై బిడెన్ సంచలన వ్యాఖ్యలు

బిడెన్, ట్రంప్ (ఫైల్ ఫోటో)

బిడెన్, ట్రంప్ (ఫైల్ ఫోటో)

కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవలే వైట్ హౌస్ కు చేరుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని అంటున్నారు. కానీ దీనికి ఆయన ప్రత్యర్థి జో బిడెన్ సుముఖంగా లేరు.

 • News18
 • Last Updated :

  కరోనా సోకినా దానిని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా కరోనా నుంచి పూర్తిగా నయం కాకున్నా.. ఆయన మాత్రం.. దాన్నుంచి కోలుకున్నానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక ఇదే విషయమై ఆయన ప్రత్యర్థి జో బిడెన్ స్పందించారు. ట్రంప్ ఇంకా కోవిడ్ తో బాధపడుతుంటే.. ఆయనతో డిబేట్ చేయడానికి తాను అంగీకరించనని చెప్పారు.

  ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... మియామిలో ఈ నెల 15న ట్రంప్, బిడెన్ ల మధ్య రెండో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగాల్సి ఉంది.  అయితే కరోనా నుంచి పూర్తిగా కోలుకోని ట్రంప్ తో తాను చర్చ చేయలేనని బిడెన్ అన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని అన్నారు.

  బిడెన్ మాట్లాడుతూ... ‘ట్రంప్ ఇంకా కోవిడ్ తో బాధపడుతుంటే.. మేము చర్చ చేయకూడదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఈ పరిస్థితుల్లో ఆయనతో చర్చకు దిగడం శ్రేయస్కరం కాదు. నేను క్లీవ్ లాండ్ క్లినిక్ నిబంధనల ప్రకారం నడుచుకుంటాను. వైద్యుల సూచనల ప్రకారం ముందుకు వెళ్లడం మేలు’ అని ఆయన చెప్పుకొచ్చారు.

  ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న బిడెన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు కల్పించారని ఆరోపించారు. పక్షపాతాలను పక్కనపెట్టాలని ఆయన సూచించారు. కరోనా నుంచి కాపాడుకోవడానికి ముఖానికి మాస్కు ధరించడం అనేది ప్రకటన మాత్రమే కాదనీ, అది శాస్త్రీయ సిఫారసు అని తెలిపారు.

  ఇదిలాఉండగా.. కోవిడ్ నుంచి ట్రంప్ కోలుకున్నారని ఆయన ప్రచార ప్రతినిధి టిమ్ ముర్తాగ్ అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మూడు రోజులుగా ఆయనకు జ్వరం గానీ, ఇతర సమస్యలు గానీ ఏమీ రాలేదని తెలిపారు. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నందుకే ఆస్పత్రి నుంచి తిరిగొచ్చారని వివరించారు.

  సాధారణంగా కరోనా సోకినవారంతా 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో గానీ హోం క్వారంటైన్ లో గానీ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంటే.. ట్రంప్ మాత్రం నాలుగు రోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అంతేగాక ఏకంగా వైట్ హౌస్ లోనే మాస్కు లేకుండా తిరుగుతుండటం విమర్శలకు దారి తీసింది. దీనిపై వైట్ హౌస్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నవంబర్ 3న అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకు వచ్చిన నివేదికలు, ఇటీవలే ముగిసిన ప్రెసిడెన్షియల్ డిబేట్ లో బిడెన్ ముందున్న విషయం తెలిసిందే.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Covid-19, Donald trump, Joe Biden, US Elections 2020, Us news

  ఉత్తమ కథలు