హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల వల్ల కరోనా వ్యాప్తి : భూమా అఖిలప్రియ

ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల వల్ల కరోనా వ్యాప్తి : భూమా అఖిలప్రియ

భూమా అఖిలప్రియ (ఫైల్ ఫొటో)

భూమా అఖిలప్రియ (ఫైల్ ఫొటో)

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వల్ల కరోనా ప్రజలకు పాకుతోందని భూమా అఖిలప్రియ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పెరగడానికి వైసీపీ నేతలు ప్రధాన కారణం అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కరోనాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలిగ్గా తీసిపారేశారని, అధికారులు కూడా ఎటువంటి జాగ్రత్తలు చెప్పకపోవడంతో ప్రజలకు వ్యాధి తీవ్రత పెద్దగా తెలియలేదన్నారు. ఎన్నికలు వస్తాయి వస్తాయి అని చెప్పి వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు బయట తిరిగారని, వారి చుట్టూ అధికారులు తిరగడం వల్ల ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేకపోయారని అఖిలప్రియ అన్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో కరోనా కేసులను బయటకు రానీయకుండా ఈ ప్రభుత్వం ఆపేసిందని అఖిలప్రియ ఆరోపించారు. చనిపోయిన వారి వివరాలు తెలియనివ్వలేదని, ఎవరికి టెస్ట్ లు చేస్తున్నాం, ఎన్ని కిట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలు బయటకు రానివ్వకుండా అధికారులను ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుని ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.

కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే కరోనా కట్టడికి ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కర్నూలు జిల్లాలో కరోనా పెరగడానికి కారణం హఫీజ్ ఖాన్ అని అందరికీ తెలుసు. జిల్లాలో కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే (బియ్యపు మధుసూదన్ రెడ్డి) ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే తీరును చూసి దేశమంతా మనల్ని చూసి నవ్వుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది. వారి కుటుంబాలకు కాళహస్తి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారు? ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు?

భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి

ప్రజల ప్రాణాల కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, ఇవేమీ పట్టని ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. అనంతపురంలో ఏఎస్ఐ చనిపోయారని, ఎమ్మార్వో కు కరోనా వచ్చిందని చెప్పారు. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులను ఆదుకుంటామని జీవోల మీద జీవోలు ఇస్తున్నారు. కానీ కార్యచరణలో పెట్టడం లేదు. లాక్ డౌన్ సమయంలో మార్కెట్ యార్డుల దగ్గర పాయింట్లు పెడుతున్నారు. దీని వల్ల రైతులు పెద్ద ఎత్తున యార్డులకు రావడం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు.


First published:

Tags: Andhra Pradesh, Bhuma Akhilapriya, Coronavirus, Covid-19, Kurnool

ఉత్తమ కథలు