BHARAT BIOTECH SEEKS PERMISSION FOR PHASE 3 TRIAL OF INTRANASAL COVID VACCINE AK GH
Intranasal Vaccine: ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ ట్రయల్స్.. థర్డ్ ఫేజ్ ప్రయోగాలకు అనుమతి కోరిన సంస్థ
ప్రతీకాత్మక చిత్రం
Intranasal Vaccine: ఇంట్రానాసల్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వంటి కొత్త కోవిడ్-19 వేరియంట్ల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలవు. భారత్ బయోటెక్ ప్రస్తుతం సమర్పించిన దరఖాస్తు బూస్టర్ డోస్ కోసం అయినప్పటికీ, ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ప్రత్యేక క్లినికల్ ట్రయల్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.
కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ దేశంలోనే తొలి ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా చుక్కల రూపంలో ఇస్తారు. ఈ స్వదేశీ వ్యాక్సిన్ తయారీదారు ఇప్పటికే టీకాకు సంబంధించి 2-దశల ట్రయల్స్ పూర్తి చేసింది. ఈ క్రమంలో తాజాగా మూడవ దశ ప్రయోగాలను పూర్తి చేసేందుకు నడుం బిగించింది. ఈ మేరకు థర్డ్ ఫేజ్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు ఓ దరఖాస్తును సమర్పించింది. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ తుది దశ (3rd Phase) ట్రయల్ అనేది బూస్టర్ డోస్‌గా పనిచేస్తుంది.
రెండేళ్ల క్రితం విజృంభించిన కరోనా ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలను వణికిస్తూనే ఉంది. కొత్తగా వెలుగుచూస్తున్న వేరియంట్లు తక్కువ సమయంలోనే ప్రపంచ దేశాలకు పాకేస్తున్నాయి. ఇండియాలో కూడా కరోనా కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో రెండు టీకా డోసులతో పాటు బూస్టర్ డోసు తీసుకోవడం కూడా తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో భారత్ బయోటెక్ బూస్టర్ డోసుగా ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలను ముమ్మరం చేసింది. అయితే దేశంలో బూస్టర్ డోస్‌గా ఇచ్చే టీకాలకు మూడవ దశ ప్రయోగాలు పూర్తి చేయడం తప్పనిసరి. మూడో దశ ప్రయోగాల సమాచారం పొందుపరిచిన తర్వాతే బూస్టర్ డోసు టీకాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే వ్యాక్సిన్ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ ఆ దిశగా ముందడుగు వేస్తోంది.
టీకా డ్రైవ్‌ల సమయంలో ఇంజక్షన్‌కు భయపడే వారికి ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను చాలా సులభంగా ఇవ్వచ్చని భారత్ బయోటెక్ చెబుతోంది. ఇంజక్షన్‌తో పోల్చుకుంటే ముక్కు ద్వారా ఇచ్చే టీకా తీసుకోవడం చాలా సులభమని నిపుణులు కూడా తెలిపారు. భారతదేశంలో మూడవ డోస్ సత్వరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫేజ్ 3 ట్రయల్స్ కోసం దరఖాస్తును సమర్పించిన రెండో కంపెనీగా భారత్ బయోటెక్ నిలిచింది.
ఇంట్రానాసల్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వంటి కొత్త కోవిడ్-19 వేరియంట్ల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలవు. భారత్ బయోటెక్ ప్రస్తుతం సమర్పించిన దరఖాస్తు బూస్టర్ డోస్ కోసం అయినప్పటికీ, ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ప్రత్యేక క్లినికల్ ట్రయల్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలను ఇండియా ఆమోదించింది. కొవాగ్జిన్ డీసీజీఐ నుంచి 28-రోజుల మల్టీ-డోస్ వయల్ పాలసీ (MDVP) కింద వినియోగానికి అనుమతి పొందింది. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ లిస్టింగ్-ఈయూఎల్) చేర్చేందుకు డబ్ల్యూహెచ్‌వో కూడా ఆమోదం తెలిపింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.