news18-telugu
Updated: November 16, 2020, 11:07 PM IST
కో వాగ్జిన్
కరోనా ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా కరోనాను ఎదుర్కొనేందుకు ముక్కులో వేసుకునే చుక్కల మందుపైన(నాజల్ డ్రాప్స్) భారత్ బయోటెక్ సంస్థ ప్రయోగాలు జరుపుతున్నట్టుగా ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆన్లైన్లో నిర్వహించిన దక్కన్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందులో 26 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారని.. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో వీటిని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం చేపట్టిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ అని ఆయన తెలిపారు.
అయితే తాము ఇప్పుడు అభివృద్ది చేస్తున్న కోవాగ్జిన్ డబుల్ డోస్ ఇంజెక్షన్ వ్యాక్సిన్ అని.. ఇది దేశంలో మొత్తం జనాభాకు(దాదాపు 130 కోట్ల మందికి) అందాలంటే 260 కోట్ల సిరంజ్‌లు, సూదులు అవసరమవుతాయని చెప్పారు. ఇది సవాలుతో కూడుకున్న అంశమని.. అందుకే తాము సింగిల్ డోస్ నాజల్ డ్రాప్స్ వ్యాక్సిన్‌పై తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. గతంలో రోటా వైరస్, పోలియో కోసం చుక్కల మందు తయారు చేసిన తమకు ఉందని గుర్తుచేశారు. కరోనా నాజల్ డ్రాప్స్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
ప్రపంచంలో బీఎస్ఎల్-3(బయో సెఫ్టీ లెవల్-3) ఉత్పత్తి కేంద్రం ఉన్న ఏకైక సంస్థ తమదేనని చెప్పడానికి గర్వపడుతున్నట్టు కృష్ణా ఎల్లా తెలిపారు. కరోనా వైరస్ ప్రమాదకరంగా మారుతుందని ముందే ఊహించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు చైనా 250 మిలియన్ డాలర్లతో బీఎస్ఎల్-3 కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. అమెరికా, ఐరోపాలో కూడా బీఎస్ఎల్-3 ఉత్పత్తి కేంద్రం లేదన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 16, 2020, 10:17 PM IST