గో కరోనా గో.. కాగడాలతో కోవిడ్ వైరస్‌ను తరిమికొట్టి తగులబెట్టిన జనం.. వైరల్ వీడియో

కాగడాలతో పరుగులు తీస్తున్న యువత

తమ గ్రామంలో కొన్ని రోజులుగా రోజుకు ఒకరు మరణిస్తున్నారని.. చాలా మంది జ్వరంతో బాధపడుతున్నారని ఓ గ్రామస్తుడు తెలిపారు. కాగడాలతో కరోనాను తరిమికొట్టిన తర్వాత ఎవరూ చనిపోలేదని చెప్పాడు. ఐతే ఇలాంటివి నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

 • Share this:
  'గో కరోనా గో'.. గత ఏడాది కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈ మంత్రాన్ని జంపించారు. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయింది. సినిమాల్లో కూడా వాడారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ 'గో కరోనా గో' స్లోగన్ మళ్లీ మార్మోగుతోంది. వ్యాక్సిన్‌లు వచ్చినా కరోనా ఆగడం లేదు. ఎన్నో మందులు వాడినా అడ్డుకోవడం లేదు. కరోనా సెకండ్ వేవ్ తుఫాన్‌లా విరుచుకుపడుతోంది. కరోనా వైరస్‌ను వైద్యశాస్త్రమే అడ్డుకోలేకపోతోంది. కానీ మారుమూల ప్రజలు మాత్రం ఇప్పటికీ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు వింత వింత చేష్టలు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కరోనాను తరిమికొట్టేందుకు స్థానికులు కాగడాలు పట్టుకొని పరుగులు తీశారు. బాగ్ కరోనా బాగ్ అంటూ... ఊరి పొలిమేర వరకు పరుగులు పెట్టారు. అగర్‌ మాల్వా జిల్లా గణేష్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

  పెద్దల సూచనల మేరకు ఆదివారం రాత్రి గణేష్‌పురా గ్రామంలో యువకులందరూ కాగడాలు వెలిగించారు. ఇంటికి ఒకరు చొప్పున కగడాలు చేతపట్టుకొని ఊరంతా పరుగులు పెట్టారు. భాగ్ కరోనా భాగ్ (వెళ్లు కరోనా వెళ్లు) అని వీధుల్లో కేకలు వేసుకుంటూ.. ఊరి పొలిమేర వరకు వెళ్లారు. అక్కడ కాగడాలను పడేసి మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. ఇలా చేస్తే.. కరోనా తమ గ్రామంలోకి రాదని స్థానికుల నమ్మకం. ఆ కాగడాల మంటల్లో కరోనా కాలిపోతుందని వీరు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఐతే కాగడాలు పట్టుకున్న యువకుల్లో చాలా మంది మాస్క్‌లు లేవు. మాస్క్‌లు ధరించాలి.. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూఢనమ్మకాలను నమ్మి.. కగడా ర్యాలీ తీశారు. తమ గ్రామంలో కొన్ని రోజులుగా రోజుకు ఒకరు మరణిస్తున్నారని.. చాలా మంది జ్వరంతో బాధపడుతున్నారని ఓ గ్రామస్తుడు తెలిపారు. కాగడాలతో కరోనాను తరిమికొట్టిన తర్వాత ఎవరూ చనిపోలేదని చెప్పాడు. ఐతే ఇలాంటివి నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.

  కాగా, మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 13,107 కొత్త కేసులు నమోదయ్యాయి. 9035 మంది కోలుకోగా.. మరో 75 మంది మరణించారు. తాజా లెక్కలతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,811కి చేరింది. వీరిలో 3,59,755 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,788 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 82,268 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: