కరోనా కష్టాలు మొదలైనప్పటి నుంచి బెంగళూరు నగరంలో చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఎంతో క్లిష్టమైన ఈ సమయంలో ఇంటికే పరిమితమైనవారికి వాలంటీర్లు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆహారపదార్థాలు, వంటసామాగ్రి, దుస్తులు వంటి నిత్యావసర వస్తువులను అందించడానికి చాలా హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఈ నగరంలో అందుబాటులోకి వచ్చాయి. ఇలా సహాయం అందించే గ్రూపుల్లో కొందరు వారే సొంతగా వస్తువులను అందిస్తుంటే, ఇంకొందరు వస్తువులు కావాలని కోరిన కుటుంబాలకు డెలివరీ ఇస్తున్నారు. గుడ్ క్వెస్ట్ ఫౌండేషన్ కూడా ఇలాంటి ఎన్జీఓల్లో ఒకటి. ఈ సంస్థ మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు, ఇతర వస్తువులను ఇంటికే డెలివరీ చేస్తోంది. ఇందుకు ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది.
మహిళలకు మరింత ప్రత్యేకంగా వీళ్లు సహాయం చేయడం వెనుక ఒక నేపథ్యం ఉంది. ఒకసారి ఒక మహిళ ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే కాల్ అందుకున్న ఒక మగ వాలంటీర్‌తో ఆమె తన అవసరాన్ని చెప్పుకోలేకపోయింది. ఈ కాల్ ఆన్సర్ చేసిన వినోద్ అనే యువకుడు తోటి మహిళా వాలంటీర్ ఫెల్సీని ఆమెతో మాట్లాడమని చెప్పాడు. వెంటనే ఫెల్సీ ఆమెకు ఫోన్ చేసి, ఏం కావాలని అడగింది. ఆమె సంకోచిస్తూ శానిటరీ నాప్కిన్లు తెచ్చివ్వగలరేమోనని అడిగింది. తర్వాత ఫెల్సి స్వయంగా వెళ్లి, ఆ మహిళ ఇంటి దగ్గర నాప్కిన్లు డోర్ డెలివరీ చేసింది.
ఇలాగే చాలా మంది మహిళలు వారికి కావాల్సిన కొన్ని వ్యక్తిగత వస్తువులు కావాలని మగ వాలంటీర్లను అగడలేకపోతున్నారు. అందుకే గుడ్ క్వెస్ట్ ఫౌండేషన్ ప్రత్యేకంగా మహిళలకు హెల్ప్ లైన్‌ను అందుబాటులో ఉంచింది. ‘లాక్డౌన్ వల్ల మహిళలు శానిటరీ న్యాప్కిన్లు, కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇతర మందులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అందువల్ల వారి కోసం ప్రత్యేకంగా ఈ హెల్ప్ లైన్ ప్రారంభించాం. ప్రాధాన్యతను బట్టి ప్రత్యేకంగా మహిళలకు కావాల్సిన వస్తువులను ఇంటి దగ్గరకు వెళ్లి డెలివరీ చేస్తున్నాం’ అని చెబుతున్నారు ఎన్జిఓ సభ్యులు. వివిధ గైనకాలజీ సమస్యలకు చికిత్స చేయించుకుంటున్న మహిళలకు, పిసిఓడి బాధితులకు అవసరమైన మందులను సంస్థ చేరవేస్తోంది. గర్భనిరోధక మాత్రలు అవసరమైన వారికి కూడా వాటిని అందిస్తున్నారు వాలంటీర్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.