Corona: బెంగళూరులో వైద్య శాఖ అధికారులను బిత్తరపోయేలా చేసిన కరోనా... రెండు కుటుంబాలకు కరోనా టెస్టులు చేయగా...

ప్రతీకాత్మక చిత్రం

దేశ ప్రజలను మరోసారి కరోనా భయం కలవరపెడుతోంది. భారత్‌లో రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో మళ్లీ కంగారు మొదలైంది. గతంలో.. ఒక కుటుంబానికి కరోనా సోకితే.. వారిలో ఏ ఒక్కరిలోనైనా లక్షణాలు కనిపించేవి. కానీ.. తాజాగా బెంగళూరులో బయటపడిన కరోనా కేసులు...

  • Share this:
    బెంగళూరు: దేశ ప్రజలను మరోసారి కరోనా భయం కలవరపెడుతోంది. భారత్‌లో రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో మళ్లీ కంగారు మొదలైంది. గతంలో.. ఒక కుటుంబానికి కరోనా సోకితే.. వారిలో ఏ ఒక్కరిలోనైనా లక్షణాలు కనిపించేవి. కానీ.. తాజాగా బెంగళూరులో బయటపడిన కరోనా కేసులు వైరస్ రూటు మార్చిందని స్పష్టం చేస్తున్నాయి. కొద్దిరోజుల నుంచి బెంగళూరులో కేసులు పెరుగుతుండటంతో.. బృహణ్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కరోనా టెస్టులను విరివిగా చేస్తోంది. అలా టెస్టులు చేసిన సందర్భంలోనే ఓ కుటుంబంలోని నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

    మరో కుటుంబంలోని ఏడుగురికి కోవిడ్-19 సోకినట్లు తేలింది. ఈ రెండు కుటుంబాల్లో అందరికీ కరోనా సోకినప్పటికీ తొలుత కరోనా సోకిన వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అలా కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తికి లక్షణాలు తెలియకపోవడంతో కుటుంబంలోని ఇతరులంతా ఆ వ్యక్తితో కలిసే ఉన్నారు. కలిసి తినడం, కలిసి మాట్లాడుకోవడం చేశారు. దీంతో.. ఈ క్రమంలో వైరస్ కుటుంబంలోని అందరికీ వ్యాప్తి చెందింది.

    ఇలా వైరస్ వ్యాప్తి చెందడంపై.. బీబీఎంపీ కమిషనర్ ఎన్.మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ.. కుటుంబాలకు కుటుంబాలు కోవిడ్-19 బారిన పడటం తమను విస్మయానికి గురిచేసిందన్నారు. లక్షణాలు కనిపించినప్పటికీ ఐసోలేషన్ పాటించకపోవడం వల్ల ఇలా వైరస్ వ్యాప్తి జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుల్లో ఒకరైన డాక్టర్ సీఎన్ మంజునాథ్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ మొదలైందని.. నియంత్రణే తక్షణ కర్తవ్యమని చెప్పారు.

    కరోనా ఫస్ట్ వేవ్‌లో ఇన్‌ఫెక్షన్ బారిన పడని కొందరు తమకు ఇక ఎప్పటికీ కరోనా సోకదని భావిస్తున్నారని, ఆ ఆలోచన సరికాదని తెలిపారు. ఆ నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తి చెందేందుకు ప్రధాన కారణమని చెప్పారు. కొందరికి వైరస్ సోకినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదని, వారు నలుగురితో కలిసి తిరగడం వల్ల ఇతరులు కూడా వైరస్ బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తొలి దశలో ఉందని, మరో రెండు నుంచి నాలుగు వారాలు ఆగితే గానీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అంచనాకు రాలేమని ఆయన వెల్లడించారు.
    Published by:Sambasiva Reddy
    First published: