లాక్ డౌన్ నిబంధనలను సడలించిన...బోసిపోయిన ఆలయం

బాసర అమ్మవారి ఆలయం భక్తులు లేకుండా వెలవెలబోతోంది

సాక్షాత్తు చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయం భక్తులు లేకుండా వెలవెలబోతోంది.

  • Share this:
    ఆదిలాబాద్ : దక్షిణ భారతదేశంలోనే ఏకైక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సాక్షాత్తు చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయం భక్తులు లేకుండా వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అంతకంతకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులు వెనకడుగు వేస్తున్నారనడానికి బాసర అమ్మవారి ఆలయమే ప్రత్యేక నిదర్శనం.

    నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. నూతన విద్యా సంవత్సరంలో అడుగిడుతున్న చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయించేవారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుండి తమ పిల్లలను బాసరకు తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించేవారు. రద్దీకి తగ్గట్లు అమ్మవారి ఆలయానికి ఆదాయం కూడా భారీ ఎత్తున వచ్చేది. కానీ ఈ ఏడు వైరస్ కారణంగా ఆలయానికి రావడానికి భక్తులు జంకుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బాసర అమ్మవారి ఆలయం పునః ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఐదు వేల మంది భక్తులే అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత నే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను ఆలయ ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు ఆలయ సిబ్బంది శానిటైజేషన్ చేస్తున్నారు.

    మరోవైపు బాసర ఆలయానికి భక్తులు రాకపోవడంతో దుకాణ యజమానులు దుకాణాలను తెరచి కూడా లాభం లేక పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరాకీ లేక పూట గడవడం కూడా కష్టమైపోయిందని దుకాణాల యజమానులు వాపోతున్నారు. బాసర ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావం రాష్ట్రంలో పూర్తిగా తగ్గేంత వరకు ఆలయానికి భక్తులు రావడానికి వెనకడుగు వేస్తారని అమ్మవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు.
    First published: