భారత్‌లో మరోసారి కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు (Covid-19) పెరుగుతున్నాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేంద్రం లేఖ రాసిన ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ అనుసరించాలని కేంద్రం కోరింది.
దాదాపు నాలుగు నెలల తర్వాత భారత్‌లో అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు వేసవిలో కూడా కోవిడ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది.
బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 54 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధిక కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. బుధవారం ఒక్క హైదరాబాద్ సిటీలోనే 40 కేసుల వరకు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 1.09గా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ (ఇన్ఫ్లూయెంజా) కలకలం రేపుతోంది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Covid cases, Hyderabad