సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో ఒక్కరోజే 34 మంది ఆటో డ్రైవర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. రోజుకు కొన్ని వందల మంది ప్రయాణికులను తరలించే ఆటోడ్రైవర్లకు కరోనా సోకడంపై సూరత్ మున్సిపల్ కమిషనర్ బీఎన్ ఫణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయన సూచించారు. ఆటో డ్రైవర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాస్క్‌లు ధరించాలని ఆదేశించారు. కూరగాయల వ్యాపారులు, కిరాణా షాపు యజమానులు, ఆటో డ్రైవర్లు, మెడికల్ షాప్ ఓనర్స్, సెలూన్ ఓనర్స్‌ను కరోనా సూపర్ స్ప్రెడర్స్‌గా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వీరందరిలో వీలైనంత మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని, కోవిడ్-19 నెగిటివ్ వస్తే వారికి హెల్త్ కార్డ్ కూడా ఇస్తన్నట్లు కమిషనర్ తెలిపారు.
గత సంవత్సరం కరోనా వ్యాప్తి మొదలైన తొలి దశలో కూడా సూరత్‌లో సూపర్ స్ప్రెడర్స్‌గా భావిస్తున్న వారందరికీ ఇదే తరహాలో టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సూరత్ నగరంలో 45,182 కరోనా పాజిటివ్ కేసులుండగా... 42,544 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నగరంలో ఇప్పటివరకూ కరోనా సోకిన వారిలో 862 మంది చనిపోయారు. ఒక్క సూరత్‌లోనే కాదు గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే గుజరాత్‌లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ శాసనమండలి చైర్మన్
గుజరాత్‌లో గత నవంబర్ 27న 1,607 కరోనా కేసులు నమోదు కాగా.. మళ్లీ ఆ స్థాయిలో సోమవారం కొత్తగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ ఫిబ్రవరిలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గుజరాత్‌లో 250 కంటే తక్కువకు పడిపోయింది. కానీ.. సరిగ్గా నెల తిరగకుండానే మళ్లీ ఈ స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇదిలా ఉంటే.. సూరత్‌లో ఒక్కరోజే 34 మందికి పైగా ఆటోడ్రైవర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మున్సిపల్ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎక్కువగా వెళుతుండే మార్కెట్లపై దృష్టిపెట్టారు. మార్కెట్‌లో కూరగాయలు, నిత్యావసరాలు అమ్మే వారందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.