news18-telugu
Updated: November 4, 2020, 3:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది. రోజూవారి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్ దిశగా ఐరోపా, అమెరికా దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ దేశాల్లో ప్రతిరోజు దాదాపు లక్ష వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెకండ్ వేవ్ లాక్డౌన్ అమలుకు ఆయా దేశాలు సిద్ధమవుతున్నాయి. దీంతో దీని ప్రభావం చమురు ధరలపై భారీ ప్రభావం పడింది. ఆయా దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే మన దేశంలో మాత్రం గత నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల కనిపించలేదు. సెప్టెంబర్ 22 నుండి పెట్రోల్ ధరలు, అక్టోబర్ 2 నుండి డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .81.06, లీటర్ డీజిల్ ధర రూ .70.46గా ఉంది. కోవిడ్–19 ప్రభావంతో గత కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ భారత్‌లో రిటైల్ చమురు ధరలు స్థిరంగానే ఉన్నాయని కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది.
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?అమెరికా, ఐరోపా దేశాల్లో కోవిడ్–19 కేసులు పెరగడంతో, చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అక్టోబర్ నెలలో బ్యారెల్ ముడి చమురు ధర 39–42 డాలర్లుగా నమోదైంది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల అనేక యూరోపియన్ దేశాలను రెండవసారి లాక్డౌన్ ప్రకటించటానికి ప్రేరేపించింది. ప్రజా రవాణా స్థంబించడంతో చమురు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. అయితే, ముడిచమురు ధరలు తగ్గడానికి కరోనాతో పాటు లిబియా చమురు సరఫరా, యుఎస్ గ్యాసోలిన్ ఇన్వెంటరీ పెరుగుదల వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అంతేకాక, డెల్టా హరికేన్ తీరానికి చేరుకోవడంతో యుఎస్ గల్ఫ్‌లో కార్యకలాపాలు మూసివేయబడటం, నార్వేలో వేతనాలు పెంచాలని కార్మికలు సమ్మె చేయడం వంటి కారణాలతో 6 ఆయిల్, గ్యాస్ క్షేత్రాల్లో చమురు వెలికితీత నిలిపివేయబడింది.
ఈ విపత్కర పరిణామాల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోయినప్పటికీ, భారత్‌లో సుంకాలను పెంచడంతో చమురు ధరలు తగ్గడం లేదు. కాగా, ప్రస్తుతం పెట్రోల్ బేసిక్ ధరపై 201 శాతం, డీజిల్ బేసిక్ ధరపై 164 శాతం ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. పెట్రోల్ అమ్మకపు ధరలో 64 శాతం, డీజిల్ అమ్మకపు ధరలో 60 శాతం కేవలం పన్నుల ద్వారానే వసూలు చేయబడుతుంది. విదేశీ రేట్లకు అనుగుణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయించబడుతున్నప్పటికీ, స్థానిక పన్ను కారణంగా రాష్ట్రాల్లో మాత్రం పెట్రోల్ అమ్మకపు ధరలు మారుతూ ఉంటాయి.
Published by:
Nikhil Kumar S
First published:
November 4, 2020, 3:12 PM IST