ఏపీ సరిహద్దుల్లో 1000 మంది... నో ఎంట్రీ అంటున్న పోలీసులు

తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నించగా... వారికి చేదు అనుభవం ఎదురైంది.

news18-telugu
Updated: March 25, 2020, 9:57 PM IST
ఏపీ సరిహద్దుల్లో 1000 మంది... నో ఎంట్రీ అంటున్న పోలీసులు
గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర భారీగా నిలిచిపోయిన వాహనాలు
  • Share this:
కరోనా వైరస్ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అయితే తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నించగా... వారికి చేదు అనుభవం ఎదురైంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏపీలోకి వెళ్లేందుకు ప్రజలు వస్తుండగా... పోలీసులు మాత్రం వారికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో జగ్గయ్యపేట ప్రాంతంలోని ఏపీ సరిహద్దుల్లో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. తమ దగ్గర తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇచ్చారని పలువురు ఏపీ పోలీసులకు చెబుతున్నా... వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు వాపోయారు.

అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం మరో రకమైన సమాధానం ఇస్తున్నారు. లాక్ డౌన్ ఉన్న కారణంగానే తాము ఎవరినీ అనుమతించడం లేదని అన్నారు. వీరిందరికీ పరీక్షలు నిర్వహించడమా ? లేక క్వారంటైన్‌కు పంపడమా అన్నది తేలాల్సి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికి వారంతా తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నారని... వారికి మంచినీరు సహా ఇతర వసతులు కల్పించే విషయాన్ని కూడా అక్కడి అధికారులనే అడగాలని చెక్ పోస్ట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సమాధానం ఇచ్చారు.

మరోవైపు ఏపీ అధికారులు, పోలీసుల తీరుపై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తీవ్రంగా మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు వైపు వెళ్లే వారి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని... అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆరు గంటల నుంచి ప్రజలు సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్నా... అధికారులు పట్టించుకోకుండా సమస్యను జఠిలం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు