జగన్ సర్కారు సంచలన నిర్ణయం.. లాక్‌ డౌన్‌ ఉల్లంఘిస్తే 6 నెలల జైలు..

జగన్ సర్కారు సంచలన నిర్ణయం.. లాక్‌ డౌన్‌ ఉల్లంఘిస్తే 6 నెలల జైలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్

మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం ఆరు నెలల పాటు జైలుకు పంపించడంతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించే అధికారం సంబంధిత అధికారులకు కల్పించింది. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప మిగతావన్నీ ఆపేయాలని స్పష్టం చేసింది. 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీఓ ఆర్టీ నంబరు 209 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 31 వరకూ రాష్ట్ర మంతటా లాక్‌ డౌన్‌ ప్రకటించింది.

    అంతర్రాష్ట్ర రవాణా సేవలు సహా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా రద్దున్నట్లు ప్రకటించింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారందరూ 14 రోజుల పాటు కఠినమైన గృహ నిర్బంధంలో ఉండాలని, వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) విధిగా పాటించాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాలలో 10 మందికి మించి గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అమలు, పర్యవేక్షణ అధికారాన్ని జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, డీఎం అండ్‌ హెచ్‌ఓలు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు కట్టబెట్టింది.

    కాగా, పోలీస్, వైద్య ఆరోగ్యం, పట్టణ స్థానిక సంస్థలు, అగ్నిమాపక, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు, బ్యాంకులు, ఏటీఎం, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలు, ఆహారం, సరుకులు, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల రవాణా, గిడ్డంగులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, కళ్ల జోళ్ల దుకాణాలు, ఔషధ తయారీ, వీటికి సంబంధించిన రవాణా, టెలికం, ఇంటర్నెట్‌ సేవలు, ఐటీ సేవకులు, నిత్యావసర వస్తువుల తయారీ యూనిట్లు, వాటి సరఫరా దారులు, కరోనా నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రైవేట్‌ సంస్థలు, పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్‌ ఏజెన్సీల రవాణా, గిడ్డంగుల్లో కార్యకలాపాలు, ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసే ఈ కామర్స్‌ సైట్లకు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: