Ap corona update: ఏపీలో మళ్లీ కరోనా కలవరం.. 24 గంటల్లో 200లకుపైగా కేసులు.. ఏడాదైనా వదలని భయం

Ap corona update: ఏపీలో మళ్లీ కరోనా కలవరం.. 24 గంటల్లో 200లకుపైగా కేసులు.. ఏడాదైనా వదలని భయం

మళ్లీ కరోనా కలవరం

ఏపీలో మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ఇప్పటికే కొన్ని చోట్ల మళ్లీ రెడ్ జోన్ లను ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.

  • Share this:
    ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వైరస్ వర్రీ మొదలైంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం రోజుల నుంచి 100కు పైగా కేసులు నమోదవుతూ ఉండగా.. శుక్రవారం కేసల సంఖ్య 200 మార్కును దాటింది. దీంతో ఒక్కసారిగా వైరస్ కేసుల ఉధృతి పెరిగిందనే భయం వెంటాడుతోంది.

    ఇటీవల కాలంలో కేసుల సంఖ్య చూస్తే గురువారం నమోదైన 174 కేసులే అత్యధికంగా ఉన్నాయి. కానీ గత 24 గంటల్లో 210 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8 లక్షల 91 వేల 388 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7 వేల180 కి పెరిగింది.

    గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపతే రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల 82 వేల 981 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 44వేల 709 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తంగా కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,48,650 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

    ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించింది. అయినా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు ప్రభుత్వంలో.. ఇటు ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

    ఏపీ వ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం సాగుతోంది.  అయినా మళ్లీ వైరస్ విస్తరిస్తుండడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా ఈ సారి వైరస్ పెరగడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణం అవుతోంది. ఎందుకంటే ఒకప్పుడు కరోనా అంటే జనాల్లో భయం ఉండేంది. మాస్కు పెట్టుకోనేది ఎవరూ బయటకు వచ్చేవారు కాదు.. కచ్చితంగా భౌతిక దూరం పాటించేవారు.. కానీ ప్రస్తుతం బయట పరిస్థితి చూస్తే ఆందోళన పెరుగుతోంది. మాస్కు పెట్టుకోకుండానే రోడ్లపైకి జనం వచ్చేస్తున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ లో జనం భారీగానే కనిపిస్తున్నారు కానీ వారికి మాస్కులు కనిపించడం లేదు. ఇక వైన్ షాపుల దగ్గర పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. శానిటైజర్ సంగతే మరిచిపోయారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. వీటికి తోడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి చాలామంది ఓటర్లు పోటెత్తారు. కానీ ఎవరూ మాస్కులు పెట్టుకున్నట్టు కనిపించలేదు. ఇక రాజకీయ నేతలు ప్రచారాల పేరిట భారీగా బహిరంగ సభలు నిర్వహించినా ఎక్కడా భౌతిక దూరం కనిపించలేదు. ఇలా మన నిర్లక్ష్యమే ఇప్పుడు కరోనా విస్తరణకు కారణమవుతోంది.
    Published by:Nagesh Paina
    First published: