Andha Pradesh: కరోనాపై నేడు సీఎం జగన్ కీలక భేటీ.. పరీక్షలు, లాక్‌డౌన్‌పై నిర్ణయం?

Andha Pradesh: కరోనాపై నేడు సీఎం జగన్ కీలక భేటీ.. పరీక్షలు, లాక్‌డౌన్‌పై నిర్ణయం?

ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan/File photo)

ఏపీలోనూ స్కూళ్ల మూసివేత, టెన్త్, ఇంటర్ పరీక్షలపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే అంశంపైనా అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్.

 • Share this:
  ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ భేటీలో వైద్యఆరోగ్య, హోంశాఖ, విద్యాశాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు మూతపడ్డాయి. టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ స్కూళ్ల మూసివేత, టెన్త్, ఇంటర్ పరీక్షలపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే అంశంపైనా అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్.

  నైట్ కర్ఫ్యూతో పాటు పగటి వేళల్లోనూ కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల ప్రార్థనాలయాల్లో ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్క్‌లపై ముంబై, ఢిల్లీ తరహా ఆంక్షలు అమలు చేసే ఛాన్స్ ఉంది. పెళ్లిళ్లు, అంతక్రియలకు పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించవచ్చు. సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని భావిస్తున్నారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేయించే అవకాశముందని సమాచారం.

  మరోవైపు ఏపీలో సచివాలయంలో కరోనా కల్లోలం నెలకొంది. కరోనాతో ఇప్పటికే ఆర్థికశాఖ సహాయ కార్యదర్శి పద్మారావు మరణించారు. సచివాలయంలో ఇప్పటి వరకు 60 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సచివాలయానికి వచ్చేందుకు ఉద్యోగులు భయపడిపోతున్నారు. హెచ్‌వోడీలు కూడా సెలవులు పెడుతున్నారు. ప్రైవేట్ సంస్థల మాదిరి తమకూ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నారు.

  కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 922 పరీక్షలు నిర్వహించగా.. 6 వేల 582 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9లక్షల 62 వేల 037 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూల్‌లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్దరేసి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు