Andhra Pradesh: ఏపీలో వ్యాక్సిన్ కొరత! ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ. 25లక్షల డోస్ లు కావలె

;ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ఏపీలో కరోనా వ్యాక్సిన్ నిండుకుందా? దీనిపై జోరుగా ప్రచారం అవుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఖండించారు. ఏపీలో సరిపడ వ్యాక్సిన్ సిద్ధంగా ఉందన్నారు. కానీ తాజాగా ఏపీ సీఎం జగన్ మాత్రం ప్రధానికి లేఖ రాశారు. మీరు నిర్వహిస్తున్న టీకా మహోత్సవంలో పాల్గొనాలి అంటే అత్యవసరంగా 25 లక్షల వ్యాక్సిన్ కావాలి అంటూ లేఖలో కోరారు.

  • Share this:
    ప్రధాని మోదీకి లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11 నుంచి టీకా మహోత్సవం నిర్వహించాలని అన్ని రాష్ట్రాల సీఎం లకు ప్రధాని మోదీ సూచించారు. కానీ రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు సరిపడ వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు. ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతం దాదాపు 2 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఒకటి రెండు రోజుల్లో ఉన్న  స్టాక్ పూర్తి కావొస్తొంది. దీంతో వ్యాక్సిన్ నిండుకునే ప్రమాదం ఉంది. ఒక్క ఏపీలోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ప్రధానిని ప్రశ్నించారు. టీకా మహోత్సవం చేయడం కాదని.. అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని.. విదేశాలకు ఎగుమతి ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన మాటలు వాస్తవమే అని సీఎంల లేఖ ద్వారా తెలుస్తోంది. తమ రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్ పంపాలని కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాసిన కాసేపటికే.. ఏపీ సీఎం జగన్ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

    ఏపీలో కరోనా వ్యక్సినేషన్ చక్కగా సాగుతోందని.. కరోనా నివారణకు కేంద్రం సూచించిన చర్యలు ఏపీ ప్రభత్వం పాటిస్తోంది అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని లేఖలో మొదట పేర్కొన్నారు. అలాగే ప్రధాని సూచన మేరకు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టీకా మహోత్సవం నిర్వహిస్తామని.. అయితే అందుకు అత్యవసరంగా 25 లక్షల వ్యాక్సిన్ డోస్ లు అవసరం ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్నారు.

    దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం సాగుతోందని లేఖలో గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ చేస్తున్నామన్నారు. టీకా మహోత్సవంలో ఏపీ పాల్గొనాలి అంటే తక్షణమే అవసరానికి సరిపడే విధంగా 25 లక్షల డోసులు పంపాలని లేఖలో జగన్ కోరారు.



    జగన్ లేఖను బట్టే ఏపీలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కొరత ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాక్ లెక్కలు, మంత్రి చెప్పిన మాటలు బట్టి చూస్తే..  మరో రెండు రోజులకు సరిపడినంత స్టాక్ మాత్రమే ఉంది. తరువాత కూడా టీకా  పంపిణీ నిర్విరామంగా కొనసాగాలి అంటే కేంద్ర నుంచి త్వరగా వ్యాక్సిన్ రావాలి. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతోంది. మరి అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసే అంత స్టాక్ కేంద్రం దగ్గర ఉందా లేదా అన్నది మాత్రం అంతు చిక్కడం లేదు.  కరోనా వ్యాక్సిన్ స్టాక్ రాకపోతే ప్రమాదం ఊహించడమే కష్టం అవుతుంది. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే వేగంగా వైరస్ విస్తరిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 2 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కరోనాను పూర్తిగా కట్టడి చేయాలి అంటే అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడమే తొలి ప్రధాన్యం. కానీ అందుకే సరిపడ్డ స్టార్ అందుబాటులోకి వస్తుందా? లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
    Published by:Nagesh Paina
    First published: